జగనన్నా..నీకు పాలాభిషేకం చేస్తే..మా నోట్లో మట్టికొడతావా

మా బాధలు అర్థం చేసుకున్న నాయకుడొచ్చాడని నమ్మాము..నీకు పాలాభిషేకం చేస్తే..మా నోట్లో మట్టి కొడతావా సీఎం జగన్ బాబూ అంటే వాపోతున్నారు ఏపీ రాజధాని అమరావతి ప్రాంత మహిళలు. మహిళల ఓట్లతో సీఎం అయి ఇప్పుడు వారిని ఆవేదనకు గురిచేయటం సరైందికాదంటున్నారు. ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చు అంటూ సీఎం జగన్ అసెంబ్లీ ప్రకటించినా క్షణం నుంచి ఏపీ అట్టుడికిపోతోంది. ఈ ప్రకటన రాజకీయ వర్గాలనే కాక సామాన్య ప్రజల్ని కూడా ఆందోళనకు గురిచేస్తోంది.
ప్రతిపక్ష నాయకులే కాక రైతులే కాక..ఇంటినుంచి బైటకు రాని మహిళలు కూడా రోడ్డుమీద బైఠాయించారు. తుళ్లూరు, మందడం, గొల్లపల్లి వంటి ప్రాంతాల్లో మహిళలు రోడ్లపై కూర్చున్నారు. మూడు రాజధానుల ప్రకటనను సీఎం జగన్ విరమించుకోవాలని..రాజకీయ లబ్ది కోసం ప్రజల్ని అంధకారంలోకి నెట్టటం సరైందికాదని వాపోయారు. భూములిస్తే మా పిల్లలకు ఉద్యోగాలిస్తామన్నారు.
ఇప్పుడు ఉద్యోగాలు లేవు..ఇంట్లో మగవారికి పనులు లేవు..ఇదిగో సీఎం జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటతో ఇలా నడిరోడ్డుమీద కూర్చోవాల్సి వచ్చిందని మహిళలు ప్రశ్నిస్తున్నారు. తమను నడిరోడ్డుపైకి లాగి..మూడు రాజధానులంటే ప్రకటించేసి తమ ఎమ్మెల్యేలతోను..మంత్రులతోను సీఎం జగన్ ఏసీ రూముల్లో పార్టీలు చేసుకుంటున్నారనీ..ప్రజల్ని వేదనకు గురిచేసిన ఏప్రభుత్వం నిలవదని అమరావతి ప్రాంత మహిళలు సీఎంను హెచ్చరిస్తున్నారు.
అన్ని పార్టీలకు సంబంధించిన కుటుంబాల వారు రాజధాని అమరావతికి భూములు ఇచ్చామని ఇప్పుడు సీఎం జగన్ హఠాత్తుగా..ఇటువంటి నిర్ణయం తీసుకోవటంతో ఆ భూముల్ని కట్నాలుగా ఇచ్చిన తమ ఆడబిడ్డల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయని ఇటువంటి అనాలోచిన నిర్ణయాలతో ప్రజల జీవితాలే కాక..రాష్ట్ర అభివృద్ధికి ప్రమాదకరంగా మారుతుందంటున్నారు మహిళలు.
అసెంబ్లీ సమావేశాలకు మాత్రమే అమరావతిని పరిమితం చేస్తే..ఈ ప్రాంతం ఏం అభివృద్ది చెందుతుంది? మా బతుకులు ఏం కావాలంటే ప్రశ్నిస్తున్నారు. ఉన్న చిన్నపాటి భూములకు ధరలు పెరుగాయలని ఆనందంలో తాము ఉంటే మూడు రాజధానులంటు పిచ్చి ప్రకటన చేసి తమను ఆందోళనలో పడేశారని వాపోతున్నారు.