అసెంబ్లీ సమావేశాలు: నెత్తిన గడ్డిమోపుతో వినూత్న ప్రదర్శన

అసెంబ్లీ సమావేశాలు: నెత్తిన గడ్డిమోపుతో వినూత్న ప్రదర్శన

Updated On : December 10, 2019 / 4:13 AM IST

తొలి రోజు ఉల్లిపాయల ధరలపై చర్చలు చేయాలని ఆందోళన చేసిన టీడీపీ రెండో రోజూ అదే పంథాను కొనసాగించింది. రైతుల సమస్యలపై మాట్లాడాలంటూ.. అసెంబ్లీ దగ్గర టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరి  వరికంకులు, పత్తిచెట్లతో నిరసన తెలిపారు. అసెంబ్లీ వరకు ర్యాలీగా వెళ్లిన చంద్రబాబు, టీడీపీ నేతలు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఏపీలో రైతులు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందుల్లో ఉన్నారన్నారు చంద్రబాబు. 

‘పంటల్ని కొనుగోలు చేసే నాథుడే లేడు.. రైతులు రోడ్లపై ధాన్యం పోశారు. పామాయిల్, వేరుశనగ రేటు కూడా తగ్గిపోయిందని.. గిట్టుబాటు ధర దేవుడెరుగు.. పంటల్ని కొనే నాథుడే లేడు’ అని వెల్లడించారు. 

దళారీ వ్యవస్థ, ప్రభుత్వ చేతగానితనమే కారణమని ఆరోపించారు.  గిట్టుబాటు ధర కల్పిస్తామని కొత్త ప్రభుత్వం చెప్పింది. ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామని చెప్పారు. అలాంటప్పుడు పంటలు ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు.

అసెంబ్లీలో తొలిరోజు ఉల్లి ధరలపై చర్చకు పట్టుబట్టిన తెలుగుదేశం పార్టీ సభ్యులు.. రెండో రోజు రైతుల సమస్యపై చర్చించాలని టీడీపీ నిర్ణయించింది. ఈ మేరకు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని, ఈ అంశంపై చర్చ జరిపి తీరాల్సిందేనని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొండికేశారు.