సై అంటే సై : విజయనగరంలో బాబు..జగన్ ఎన్నికల ప్రచారం

టీడీపీ అధినేత ఇప్పటికే ఎన్నికల శంఖారావాన్ని పూరించగా.. వైసీపీ అధ్యక్షుడు సమర శంఖం పూరించబోతున్నారు. ఈ ఇద్దరు నేతలు మార్చి 17వ తేదీ ఆదివారం ఉత్తరాంధ్రలో సై అంటే సై అనబోతున్నారు. విజయనగరం జిల్లాలో ఒకేరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ ఏపీలో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. శనివారం ప్రచారాన్ని ప్రారంభించిన చంద్రబాబు.. మార్చి 17వ తేదీ ఆదివారం నాలుగు జిల్లాలో ప్రచారం చేయనుండగా.. సమరశంఖం పూరించనున్న జగన్ మూడు జిల్లాల్లో క్యాంపెయిన్ చేయనున్నారు.
ఇరు పార్టీల అధినేతలు విజయనగరం జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. దీంతో జిల్లాలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. తమ అధినేతల పర్యటనలకు ఆయా పార్టీల నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి హెలికాప్టర్‌లో నేరుగా విజయనగరం చేరుకోనున్న చంద్రబాబు.. ఉదయం పదిన్నర గంటలకు అయోధ్య మైదానంలో జరిగే బహిరంగసభలో పాల్గొని ప్రసంగించనున్నారు. అటు… విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో తొలి ఎన్నికల బహిరంగ సభ నిర్వహించనున్న జగన్.. అక్కడినుంచి నేరుగా విజయనగరం జిల్లాకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12గంటలకు నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడలో రోడ్ షో నిర్వహిస్తారు. ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లాకు వెళ్లనున్న జగన్.. పి.గన్నవరం నియోజకవర్గంలోని అంబాజిపేటలో నిర్వహించే ప్రచార సభకు హాజరవుతారు. మొత్తంగా ఇరు పార్టీల అధినేతలు ప్రచారాన్ని హోరెత్తించనున్నారు.