గర్భంలోనే శిశువుకు కరోనా : అమ్మ బొజ్జలో ఉండే బుజ్జాయిని కూడా విడిచిపెట్టని మహమ్మారి..!!

తల్లి బొజ్జలో హాయిగా ఉన్నబుజ్జాయిని కూడా కరోనా మహమ్మారి వదల్లేదు. పిండంగా తయారైయ్యాక ఇంకా ఈ లోకంలోకి కూడా రాలేదు. అప్పుడే కరోనా మహమ్మారి బారిన పడింది తల్లి గర్భంలో ఉన్న శిశువు. వింత వింతగా మారిపోతున్న కరోనా మహమ్మా తీరుకు సైంటిస్టులు కూడా ఆశ్చర్యపోతున్న క్రమంలో ఢిల్లీలో ఉన్న ఓ మహిళ కడుపులో ఉండే శిశువుకు కరోనా సోకింది.
ఈ ఘటనలో మరో విచిత్రమేంటంటే..ఆ మహిళ గర్భిణిగా ఉన్నసమయంలో కరోనా టెస్ట్ లు చేయగా పాజిటివ్ వచ్చింది..కానీ ఆమెకు డెలివరీ దగ్గరపడుతుండటంతో డాక్టర్లు మరోసారి కరోనా టెస్ట్ లు చేయగా నెగిటివ్ వచ్చింది. ఆ తరువాత ఆమెకు డెలివరీ అయ్యింది.
అలా డెలివరీ అయిన ఆరు గంటల తర్వాత పసిగుడ్డుకు కూడా డాక్టర్లు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ ఫలితం వచ్చింది…! ఇటువంటి కేసులు మన భారతదేశంలోనే మొదటిసారి అని ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రి డాక్టర్స్ తెలిపారు.
నంగ్లోయికి చెందిన 25 ఏళ్ల మహిళ గర్భం ధరించింది. ఆమెకు జూన్ 11న కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణికి జూన్ 25న మళ్లీ కరోనా పరీక్షలు నిర్వహించారు. ఫలితం పాజిటివ్ వచ్చింది. మళ్లీ జులై 7వ తేదీన ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ గా నిర్ధారణ అయింది.
ఆ మరునాడే ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన ఆరు గంటల తర్వాత.. చిన్నారి నమూనాలను సేకరించి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది.
ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే..పుట్టిన బిడ్డకు కరోనా ఇన్ ఫెక్షన్ తీవ్రంగా ఉందని డాక్టర్లు ఆందోళ వ్యక్తంచేశారు. తల్లి బొడ్డుతాడు నుంచి బిడ్డకు కరోనా వ్యాపించే అవకాశం ఉందని..అదే ఈ బిడ్డ విషయంలో జరిగిందని రామ్ మనోహర్ లోహియా డాక్టర్లు తెలిపారు. చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. ఆ పసిగుడ్డు కోలుకుని అమ్మ ఒడిలో వెచ్చగా బజ్జోవాలని..తల్లీ బిడ్డలు సంతోషంగా జీవించాలని కోరుకుందాం..