బీజేపీ-జనసేన లాంగ్ మార్చ్ వాయిదా

బీజేపీ-జనసేన సంయుక్తంగా ఫిబ్రవరి 2న తలపెట్టిన లాంగ్ మార్చ్ వాయిదా పడింది. ఈ లాంగ్ మార్చ్ తేదీని త్వరలోనే ఇరు పార్టీలు ప్రకటించనున్నాయి. రాజధాని కోసం భూములను త్యాగం చేసిన అమరావతి ప్రాంత గ్రామాల రైతుల కోసం ఫిబ్రవరి 2న భారీ కవాతు నిర్ణయించాలని జనసేన, బీజేపీ నిర్ణయించాయి. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్న సీతానగరం లాకుల నుంచి బందరు రోడ్డులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు ఫిబ్రవరి 2న మధ్యాహ్నం 2 గంటలకు బీజేపీ, జనసేన పార్టీలు సంయుక్తంగా భారీ కవాతు నిర్వహించాలని తలపెట్టాయి.
దీనికి సంబందించి బీజేపీ – జనసేన కూటమి సమన్వయ కమిటీ సమావేశం ఢిల్లీలో జరిగింది. రాష్ట్రంలో చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన నేతలు నాదెండ్ల మనోహన్, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుతో పాటు మరో బీజేపీ నేత పురందేశ్వరి వంటి నేతలు సమావేశంలో పాల్గొని చర్చించారు.
రాష్ట్ర పరిస్థితులపై ఇకపై ఏ కార్యక్రమాలు నిర్వహించినా..ఇరు పార్టీలు కలిసే చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో అమరావతి ప్రాంత రైతులకు సంఘీభావం తెలిపేందుకు ఫిబ్రవరి 2న మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నుంచి విజయవాడలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు కవాతు నిర్వహించాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. కానీ కొన్ని కారణాల వల్ల ఈ లాంగ్ మార్చ్ వాయిదా పడింది.