బోటు ప్రమాదం : మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా

గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు సీఎం జగన్ రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రమాద ఘటనపై అధికారులతో సీఎం జగన్ మాట్లాడారు. ఎప్పటికప్పుడు సహాయక చర్యల వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఘటనా స్థలానికి దగ్గరలో ఉన్న మంత్రులు వెళ్లాలని ఆదేశించారు. సహాయక చర్యలపై డీజీపీ, జిల్లా ఎస్పీతో మాట్లాడి ఎప్పటికప్పుడు ఘటనపై సమాచారం ఇవ్వాలని జగన్ అధికారులను ఆదేశించారు.
బోటు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. 27మంది బయటపడగా, గల్లంతైన వారికి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బోటులో అందులో 62 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 12 మంది హైదరాబాద్ వాసులు, 17 మంది వరంగల్ వాసులు, విశాఖ, రాజమహేంద్రవరానికి చెందిన 30 మంది, విజయవాడకు చెందిన ముగ్గురు ఉన్నట్లు గుర్తించారు. కచ్చులూరు దగ్గర గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ప్రమాదం జరిగింది. వెనక్కి తీస్తుండగా రాయికి తగిలి బోటు తిరగబడినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే ప్రమాదానికి గురైన రాయల్ వశిష్ట బోటును ప్రయివేట్ వ్యక్తి నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. కోడిగుడ్ల వెంకట రమణ అనే వ్యక్తి ఈ బోటును తిప‍్పుతుండగా బోటుకు అనుమతులు లేనట్లుగా అధికారులు చెబుతున్నారు.
Also Read : గోదావరిలో బోటు ప్రమాదం : హెలికాప్టర్లతో సహాయక చర్యలు