ఆపరేషన్ వశిష్ట – 2 క్లైమాక్స్ : సాయంత్రానికి బోటు బయటకు!

ఆపరేషన్ రాయల్ వశిష్ట-2 క్లైమాక్స్‌కు చేరింది. గోదావరిలో మునిగిన బోటు.. 37 రోజుల తరువాత ఒడ్డుకు చేరే తరుణం ఆసన్నమైంది. 2019, అక్టోబర్ 21వ తేదీ సోమవారం సాయంత్రంలోగా ధర్మాడి సత్యం అండ్ టీమ్ బోటును బయటకు తీసుకొచ్చే అవకాశముంది. దీంతో బోటు ప్రమాదంలో ఇప్పటి వరకు ఆచూకీ తెలియని వారి కుటుంబాల్లో ఉద్వేగం నెలకొంది. విశాఖ నుంచి వచ్చిన డీప్ సీ డైవర్స్.. నదీ గర్భంలో ఉన్న బోటుకు తాళ్లు బిగించారు. సోమవారం ప్రొక్లెయిన్లతో బయటకు లాగడమే మిగిలింది. అంతా సవ్యంగా జరిగితే.. మరికొన్ని గంటల్లోనే.. రాయల్ వశిష్ట నదీ గర్భం నుంచి ఒడ్డుకు చేరే అవకాశముంది.
ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలన్నీ ఒక ఎత్తైతే.. నదిలో ఉన్న బోటు దగ్గరికి వెళ్లి.. దానికి తాళ్లు బిగించడం మరో ఎత్తు. ఆదివారం ఆపరేషన్‌లో.. ఈ స్టేజ్‌ను విశాఖ సీ డైవర్స్ పూర్తి చేశారు. నదీ గర్భంలో ఉన్న బోటు ముందు భాగానికి.. ఐరన్ రోప్స్ కట్టారు. బోటు వెనుక భాగంలో తాళ్లు బిగించనున్నారు. తర్వాత.. ప్రొక్లెయిన్లతో బోటును ఒడ్డుకు లాగుతారు. సోమవారం సాయంత్రానికి.. బోటు బయటకు వస్తుందని ధర్మాడి సత్యం బృందం, డీప్ సీ డైవర్స్ అంచనా వేస్తున్నారు.
మరోవైపు వరద కారణంగా.. బోటులో బాగా బురద చేరింది. సాధారణంగా బోటు 40 టన్నులు ఉంటుందని.. ఇప్పుడు మట్టి చేరడంతో మరింత బరువు పెరిగింది. అంతటి బరువైన బోటును ఒడ్డుకు చేర్చడంపైనే ధర్మాడి సత్యం టీమ్ దృష్టి పెట్టింది.
Read More : బయటకొచ్చే ఘడియలు : ఆఖరి దశలో ఆపరేషన్ వశిష్ట – 2