దొంగ వస్తున్నాడు జాగ్రత్త: కుమ్మక్కు రాజకీయాల్ని తిప్పికొట్టండి

అమరావతి : సీఎం కేసీఆర్ పై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఫైర్ అయ్యారు. నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు జగన్, కేసీఆర్ లపై విరుచుకుపడ్డారు. ‘‘దొంగ వస్తున్నాడు జాగ్రత్త’’ అనే నినాదం ప్రజల్లోకి బలంగా వెళుతోందని జగన్ ని ఉద్ధేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్నికల యుద్ధంలో దోపిడీ దొంగలకు బుద్ది చెబుదామని నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. కేసీఆర్, జగన్ కుమక్కు రాజకీయాలపై మండి పడ్డారు. వీరిద్దరి కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు నేతలకు దిశానిర్ధేశం చేశారు. కేసీఆర్ ఏపీపై కుట్రలు పన్నుతుంటే జగన్ దాన్ని సమర్థిస్తున్నాడనీ.. దీన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు.
కేసీఆర్ ఏపీ ప్రజలపై పెత్తనం చేస్తామంటే చూస్తూ ఊరుకోమబోమని హెచ్చరించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామనే తత్వమే తప్ప తనది గొడవలు పెట్టుకునే తత్వం కాదనీ అందుకే కేసీఆర్ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నా ఊరుకుంటున్నామన్నారు. కానీ కేసీఆర్ ఏపీ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే మాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. ఏపీ ప్రజలు తనకు ఊడిగం చేయాలనే రీతిలో వ్యవహరించే కేసీఆర్ తో సహవాసం చేస్తున్న ఆయన చెప్పినట్లల్లా ఆడుతున్నాడని ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాల్సిన అవసరముందన్నారు. దీన్ని ప్రజలు తిప్పికొట్టాలన్నారు. అటువంటి వ్యక్తితో అంటకాగుతున్న జగన్ వ్యక్తిత్వాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని..వీరి కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎన్నికల్లో విజయం సాధించేలా నేతలంతో పనిచేయాలని చంద్రబాబు సూచించారు.