ఆయనకు కుటుంబం కంటే మీరే ఎక్కువ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు భార్య భువనేశ్వరి నేడు రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. అమరావతిలో నిరసనలు తెలుపుతున్న రైతుల కుటుంబాలకు సంఘీభావంగా ఆమె నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, మందడం గ్రామాల్లో ఆమె పర్యటన కొనసాగుతుంది. రైతుల పోరాటం 15వ రోజుకు చేరగా, తుళ్లూరులో మహాధర్నాను నిర్వహిస్తున్నారు రైతులు.
ఈ క్రమంలోనే రాజధాని ప్రాంతంలో మహిళలను ఉద్ధేశించి మాట్లాడారు. రాష్ట్రం కోసం చంద్రబాబు ఎన్నో కలలు కన్నారని నారా భువనేశ్వరి తెలిపారు. యర్రబాలెంలో రైతుల దీక్షకు మద్దతు తెలిపి మాట్లాడుతూ.. పోలవరం నిర్మించి సాగునీటి కొరత లేకుండా చేయాలనుకున్నారని అన్నారు. గత ఐదేళ్లు అమరావతి నిర్మాణం గురించే ఆలోచించేవారని చెప్పారు. చంద్రబాబు మొదటి ప్రాధాన్యత రాష్ట్రమే అని అన్నారు. ఆ తర్వాతే కుటుంబమని అన్నారు.
రాజధాని రైతులకు చంద్రబాబు మద్దతు ఉంటుందని, అమరావతి రైతులు నమ్మకాన్ని చంద్రబాబు వమ్ము చేయరని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. రాజధాని రైతుల కోసం చంద్రబాబు మాత్రమే కాదు.. చంద్రబాబు కుటుంబం మొత్తం ఉంటుదని భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, అమరావతి కోసమే ఆయన కష్టపడ్డారని, కుటుంబం కంటే ఎక్కువ ఆయన అమరావతి, ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచించారని అన్నారు. జై జవాన్.. జై కిసాన్.. జై అమరావతి అంటూ ఆమె ప్రసంగాన్ని ముగించారు.