కెమికల్ లిక్విడ్ తాగిన ఘటన : ఏడుకు చేరిన మృతులు

గాజువాక : విశాఖపట్నంలోని గాజువాకలో కెమికల్ లిక్విడ్ తాగిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. ఈ ఘటనలో ఆదివారం (ఫిబ్రవరి 24) ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతు ఈరోజు మరో నలుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా..ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కాలనీ వాసులకు కెమికల్ లిక్విడ్ ఎక్కడ నుంచి వచ్చిందీ..తెచ్చింది ఎవరు అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
గాజువాకలోని స్వంతంత్ర నగర్ లోని ఎస్టీ కాలనీకి చెందిన 17మంది ఫిబ్రవరి24న నాటు సారా అనుకుని కెమికల్ ద్రావణాన్ని తాగారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైనవారిని విశాఖ కేసీహెచ్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో మొత్తం ఏడుగురు మృతి చెందారు. దీంతో విశాఖ కలెక్టరేట్ ముందు బాధిత కుటుంబ సభ్యులు ధర్నా చేపట్టారు. తమకు నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.