సర్వం సిద్ధం : చిత్తూరులో ఎన్నికలు 2019

చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలు..మూడు పార్లమెంటు నియోజకవర్గాలకు కలిపి 210 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. చిత్తూరు, తిరుపతి, రాజంపేట లోక్‌సభ నియోజకవర్గాల్లో మొత్తం 29 మంది పోటీ చేస్తుండగా… 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 181 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. వీరిలో 161 మంది పురుషులు, 20 మంది మహిళలు ఉన్నారు.
చిత్తూరు జిల్లాలో 31 లక్షల 88 వేల 187 మంది ఓటర్లు ఉండగా… వీరిలో పురుషులు 15 లక్షల 71 వేల 116 మంది.. 16 లక్షల 5 వేల 724 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కోసం మొత్తం 3 వేల 800 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. 11 వేల 678 వీవీ ప్యాట్లు…11 వేల 098 కంట్రోల్ యూనిట్లు…11 వేల 883 బ్యాలెట్ యూనిట్లను అన్ని నియోజకవర్గాలకు తరలించారు. జిల్లాలో 525 సమస్యాత్మక కేంద్రాల్ని గుర్తించిన అధికారులు వీటి పరిధిలో 936 పోలింగ్ బూతులు ఉన్నట్లు నిర్ధారించారు. ఈ ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు.
జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు సజావుగా జరిగేందుకు 9 వేల మంది పోలీసు సిబ్బందిని నియమించారు. కేరళ నుంచి 10 కంపెనీల సాయుధ బలగాలు జిల్లాకు చేరుకున్నాయి. వీరికి తోడుగా CISF, CRPF, APSP బలగాలను వినియోగించుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 88 చెక్ పోస్టులను పటిష్టం చేశారు. 14 వేల 500 మందిని ఇప్పటికే బైండోవర్ చేశారు. అలాగే ఎన్నికల కోసం 795 బస్సులు, 291 మినీ బస్సులు, 59 జీపులను వినియోగించనున్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రద్యుమ్న హెచ్చరించారు.
పోలింగ్ కేంద్రాల దగ్గర ఏప్రిల్ 09వ తేదీ మంగళవారం సాయంత్రం ఆరు గంటల నుంచి గురువారం సాయంత్రం ఆరు గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా 95 శాతం ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తయ్యింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అతిక్రమణలపై 307 కేసులు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న 8 కోట్ల నగదు పట్టుకున్నారు. 5 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, ఇతర వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు రెండు కోట్ల 80 లక్షల విలువైన మద్యం బాటిళ్లు, సారా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.