పవన్ మానవత్వం : సీఎం జగన్ కు ఇంకా టైం ఇస్తాం

  • Published By: madhu ,Published On : September 6, 2019 / 12:13 PM IST
పవన్ మానవత్వం : సీఎం జగన్ కు ఇంకా టైం ఇస్తాం

Updated On : September 6, 2019 / 12:13 PM IST

సీఎం జగన్ 100 రోజుల పాలనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయ్యారు. ఇంకా కొంత సమయం తీసుకుంటామన్నారు. ప్రతి నెలా ప్రకటించిన పథకాలు అనేది ప్రకటనలకు కాదు.. ఆచరణలో కావాలన్నారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోమన్న పవన్.. గత ప్రభుత్వం చేసిన తప్పులు ఉంటే వైసీపీ ప్రభుత్వం సరి చేయాలన్నారు. సెప్టెంబర్ 06వ తేదీ శుక్రవారం ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాలనతో సహా అనేక అంశాలపై పీఏసీలో చర్చించినట్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో దిండిలో జనసేన మేదోమథనం జరిగింది. 

రైతులు ఉత్పత్తి చేసే వస్తువులకు జనసైనికులు అండగా ఉండాలని మేథోమథనంలో తీర్మానం చేసినట్లు వెల్లడించారు పవన్ కల్యాణ్. దేవాలయాల్లో అర్చకులకు ఇస్తామన్న జీతాలు వెంటనే ఇవ్వాలని, 10 నెలల బకాయిలు ఉండిపోయాయన్నారు. ఇలాంటి అనేక సమస్యలు ఇంకా ఉన్నాయన్నారు. కొన్ని సమస్యలను ఐదారు కమిటీలకు తాము అధ్యయనం చేసేందుకు ఇచ్చామన్నారు. కమిటీలు నివేదిక వచ్చిన అనంతరం పరిశీలన చేసి క్లారిటీగా స్పందిస్తామన్నారు. 

రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఈ ప్రాంతంలో ఉన్నందుకే.. ఇక్కడే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఎమ్మెల్యేపై దాడి చేసినప్పుడే రావాలనుకున్నాను.. గొడవలకు దూరం అని వెల్లడించారు పవర్ స్టార్. సమస్యల పరిష్కారానికే తన పర్యటన అని వివరించారు జనసేనాని. ఏపీలో శాంతిభద్రతలు లోపించాయని.. రాపాక విషయాన్ని పోలీసులు అంత పెద్దది చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు పవన్.

రాజధాని తరలించాలని తామెప్పుడూ అనలేదని వివరించారు పవన్. గ్రీన్ క్యాపిటల్ రాజధాని కట్టాలని మాత్రమే సూచించామన్నారు. రాజధానిపై సీఎం జగన్ మాట్లాడకపోతే మంత్రి బొత్స మాటలనే లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇప్పటి వరకు ఖర్చు చేసిన నిధులు ఎవ్వరు కడతారు.. బొత్సా ఇంటి నుంచి కడతారా అంటూ కామెంట్ చేశారు. కాపు రిజర్వేషన్ల విషయంపై కూడా పవన్ మాట్లాడారు. కేంద్ర నిర్ణయంతో వెళ్లాలనేది తమ అభిప్రాయమని, ఇంకా చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.