ఆఖరి నిమిషంలో MLC అభ్యర్థిని మార్చిన టీ. కాంగ్రెస్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషంలో రంగారెడ్డి స్థానిక సంస్థల MLC అభ్యర్థిని మార్చివేసింది. రంగారెడ్డి స్థానిక సంస్థల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని బరిలోకి దింపింది. ఆదివారం (మే 13,2019)న ఉదయ మోహన్ రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. కానీ మరికాసేపట్లో నామినేషన్ వేయాల్సి ఉండగా హఠాత్తుగా వరంగల్ కు చెందిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి బరిలోకి దింపింది. స్థానిక పరిస్థితులు..జిల్లాలోని రాజకీయ పరిస్థితులు..పార్టీ బలబలాలను అంచనా వేసిన ఉదయ్ మోహన్ రెడ్డి పోటీకి నిరాకరించారు. దీంతో ప్రతాప్ రెడ్డితో కాంగ్రెస్ నామినేషన్ వేయించింది.
కాగా తనను సంప్రదించకుండానే తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారని ఉదయ్ మోహన్ రెడ్డి అంటున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలో గతంలో బీజేపీ పార్టీకి చెందిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని బరిలోకి దించినట్లుగా తెలుస్తోంది. కాగా గత అసెంబ్లీ ఎన్నికల నుంచి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించినంతగా విజయాలు దక్కకపోవటం..నెగ్గిన ఎమ్మెల్యేలు కూడా టీఆర్ ఎస్ పార్టీలోకి చేరిపోవటం వంటి కష్టకాలంలో ప్రస్తుతం ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితుల్లో పార్టీ ఉంది. ఈ క్రమంలో రంగారెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థి మార్పు కూడా దీంట్లో భాగమేనని సమచారం.