బాధాకరమైన ఘటన : బోటు ప్రమాదంపై మోడీ ట్వీట్

  • Published By: madhu ,Published On : September 15, 2019 / 01:20 PM IST
బాధాకరమైన ఘటన : బోటు ప్రమాదంపై మోడీ ట్వీట్

Updated On : September 15, 2019 / 1:20 PM IST

ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాదంపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బోటు ప్రమాదం ఒక అతి బాధాకరమైన ఘటన అన్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం సాయంత్రం ట్విట్టర్ వేదికగా తెలుగులో ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రమాద స్థలం వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. 

పాపికొండల విహారం మధ్యలోనే విషాదంగా ముగిసింది. దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర రాయల్ వశిష్ట బోటు బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో పడవలో 71 మంది ఉన్నారు. ఈ పడవ రెండంతస్తులుగా ఉంది. కిందది ఏసీ, పైన ఉన్నది నాన్ ఏసీ. మొత్తం 12 మంది మృతి చెంది ఉంటారని అంచనా. 24 మందిని రక్షించారు. మిగతా వారి ఆచూకి
కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. 

గోదావరి నదిలో పర్యాటకుల బోటు మునిగిపోవడంతో..మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికి తీశారు. ప్రయాణిస్తున్న వారిలో 61 మంది ప్రయాణికులు కాగా… మిగతా 10 మంది సిబ్బంది. ఈ ఘటనలో బోటు డ్రైవర్లు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. వీరిని నూకరాజు, తామరాజుగా గుర్తించారు. బోటు ప్రమాదం నుంచి బయటపడ్డ వారిని చికిత్స కోసం రంపచోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.