ప్రకాశంలో నకి‘లీలలు’ : నకిలీ ఎరువుల మాఫియా
ప్రకాశం : రైతులను నట్టేట ముంచుతున్నారు. అటు గిట్టుబాటు ధర లేక..కరువుతో అల్లాడుతున్న రైతులను నకిలీ వ్యాపారులు బెంబేలెత్తిస్తున్నారు. నకిలీ అనే విషయం తెలియక రైతులు మందులను..ఎరువులను కొనుగోలు చేసి తీవ్ర నష్టాల పాలవుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం సోమేపల్లిలో నకిలీ ఎరువుల భాగోతాన్ని అధికారులు బట్టబయలు చేశారు. సోమేపల్లిలో నకిలీ ఎరువులు అమ్మకాలు చేస్తున్నారంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. గోప్యంగా అధికారులు దాడులు చేశారు. 620 బస్తాలను సీజ్ చేసిన అధికారులు దీని విలువ రూ. 7 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. గుంటూరు జిల్లా నర్సంపేట కేంద్రంగా నకిలీ వ్యాపారం జరగుతున్నట్లు గుర్తించారు. ప్రకాశం, గుంటూరు, అనంతపురం తదితర జిల్లాలో ఈ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యాపారం వెనుక ఎవరున్నారనే దానిపై పోలీసులు, అధికారులు దృష్టి సారించారు.