పేద తండ్రి దుస్థితి : కూతురి శవాన్ని మోసిన తండ్రి

కరీంనగర్ ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో కూతురి మృతదేహాన్ని తండ్రి చేతులపై మోసుకెళ్లాడు. కాల్వశ్రీరాంపూర్ మండలం కునారానికి చెందిన సంపత్ కూతురు తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చనిపోయింది.
కుమార్తె మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు తన వద్ద డబ్బుల్లేవని ప్రభుత్వ అంబులెన్స్ పంపాలని సంపత్ ఆస్పత్రి అధికారులను కోరాడు. అంబులెన్స్ పనిచేయడం లేదని అధికారులు సమాధానమిచ్చారు. దీంతో చేసేదేమి లేక తండ్రి సంపత్ కూతురు మృతదేహాన్ని చేతులపై మోసుకెళ్లాడు. ఇక తన కూతురు కనబడదని..అనంతలోకాలకు వెళ్లిపోయిందని కళ్లనీళ్లు పెట్టుకున్నాడు.
శవాన్ని మోస్తూ విలపిస్తుండడం అక్కడున్న వారిని కలిచి వేసింది. స్థానికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆస్పత్రి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.