ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం (అక్టోబర్ 11, 2019) కళ్యాణి డ్యాం సమీపంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూంబింగ్ చేస్తుండగా.. స్మగ్లర్లు తారసపడ్డారు. లొంగిపోవాలని హెచ్చరించిన పోలీసులపై స్మగ్లర్లు రాళ్లదాడి చేశారు. అయితే.. ఐదుగురు స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 24 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు.
ఎర్రచందనం స్మగ్లర్లు బరితెగించిపోయారు. ఏకంగా తిరుమల నుంచే ఎర్రచందనం అక్రమ రవాణాకు దిగుతున్నారు. బ్రహ్మోత్సవాలను అడ్డం పెట్టుకుని భక్తుల ముసుగులో తమిళ దొంగలు దర్జాగా ఎర్రచందనాన్ని కొండపై నుంచి తరలిస్తున్నారు. (అక్టోబర్ 10, 2019) తిరుమల అలిపిరి దగ్గర ఓ వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు అందులో 13 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. రెండు టోల్‌గేట్లు దాటి వచ్చినా ఆ వాహనంలో ఏముందన్నది పోలీసులు పసిగట్టలేకపోయారు. భక్తుల ముసుగులో వచ్చి దర్జాగా ఎర్రచందనాన్ని తీసుకువెళ్లినట్లు అనుమానిస్తున్నారు అధికారులు.