టీడీపీలోకి హర్షకుమార్.. అమలాపురం ఎంపీగా పోటీ?

అధికార తెలుగుదేశం పార్టీలోనూ ప్రతిపక్ష వైసీపీలోనూ ఎన్నికల వేళ ఆయారం.. గయారం నేతలు ఎక్కువయ్యారు. ఈ క్రమంలో కోనసీమ ప్రధాన కేంద్రమైన తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. మాజీ అమలాపురం ఎంపీ జీవీ హర్షకుమార్ తెలుగుదేశంలో చేరేందుకు సిద్ధం అయ్యారు. అమలాపురం లోక్‌సభ నియోజకవర్గ స్థానం నుంచి పోటీ చేసేందుకుగాను.. హర్షకుమార్ తెలుగుదేశం గూటికి చేరుతున్నట్లు తెలుస్తుంది. తూర్పుగోదావరి జిల్లాలో మంచి పట్టు ఉన్న నేతల్లో ఒకరైన జీవీ హర్షకుమార్‌ను టీడీపీలోకి చేర్చుకునేందుకు గతకొంతకాలంగా ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంతో టీడీపీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు.
ఈ క్రమంలో ‘నేతలను గౌరవించే నాయకుడు చంద్రబాబు. నేతలను అవమానపరిచే మనస్తత్వం జగన్‌ది’ అందుకే చంద్రబాబుతో కలసి పనిచేయాలని భావిస్తున్నాను అని హర్షకుమార్ అన్నారు. ‘‘చంద్రబాబు పిలుపు కోసం ఎదురుచూస్తున్నా. అమలాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా’’ అని కూడా హర్షకుమార్ స్పష్టం చేశారు. మరోవైపు అమలాపురం లోక్‌సభ వైసీపీ అభ్యర్థిగా చింతా అనూరాధ పేరు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తుండగా.. జనసేన నుంచి ఇప్పటికే డీఎంఆర్ శేఖర్ పేరును ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుండి పార్లమెంటుకు టీడీపీ తరుపున వెళ్లిన పండుల రవీంద్రబాబు..వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.