ఆ కిక్కే వేరప్పా : ఒకే ఫ్యామిలీ నుంచి నలుగురికి జనసేన టికెట్లు

  • Published By: vamsi ,Published On : March 26, 2019 / 04:29 AM IST
ఆ కిక్కే వేరప్పా : ఒకే ఫ్యామిలీ నుంచి నలుగురికి జనసేన టికెట్లు

Updated On : March 26, 2019 / 4:29 AM IST

రాజకీయాల్లో వారసులు ఎంట్రీకి కొదవేం ఉండదు. నాయకులు కూడా వారివారి బలాలను బట్టి కుటుంబంలో ఒకరిద్దరికీ సీట్లు ఇస్తుంటాయి. కర్నూలు జిల్లాలో కూడా ఒకే కుటుంబం నుంచి నలుగురు బరిలోకి దిగుతున్నారు. జనసేన పార్టీ తరఫున నంద్యాల లోక్‌సభ టిక్కెట్ దక్కకపోవడంతో పార్టీ మారిన టీడీపీ నాయకుడు ఎస్పీవై రెడ్డి జనసేన గూటికి చేరారు. ఈ క్రమంలో జనసేనలో చేరిన ఎస్పీవై రెడ్డికి నంద్యాల లోక్‌సభ సీటును కేటాయించిన జనసేన ఆ పార్టీ తరుపున మరో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఎస్పీవై రెడ్డి తన కుటుంబం నుంచి నిలబెట్టించారు.
జనసేన తరుపున ఎస్పీవై రెడ్డి కుటుంబం నుంచి  పెద్ద కుమార్తె సుజల శ్రీశైలం శాసనసభ అభ్యర్థిగా సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. బనగానపల్లి నియోజకవర్గం నుంచి ఎస్పీవైరెడ్డి చిన్న కుమార్తె అరవిందరాణి, పెద్ద అల్లుడు సజ్జల శ్రీధర్‌రెడ్డి నంద్యాల అసెంబ్లీకి నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆదర్శ భావాలే లక్ష్యంగా పార్టీ స్థాపించి, కుటుంబ పాలనకు చరమగీతం పాడుతానంటూ ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్..  ఒకే కుటుంబం నుంచి ఒకే లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో నలుగురు పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వడం చర్చనీయాంశం అయింది.