ఉచిత వసతి, భోజనం : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ పరీక్ష

  • Published By: madhu ,Published On : August 31, 2019 / 03:17 AM IST
ఉచిత వసతి, భోజనం : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ పరీక్ష

Updated On : August 31, 2019 / 3:17 AM IST

ఏపీ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 2019, సెప్టెంబర్ 01వ తేదీ ఆదివారం ఎగ్జామ్ జరుగనుంది. లక్షా 26 వేల 728 ఉద్యోగాలున్నాయి. దీనికి భారీగా స్పందన వచ్చింది. 21 లక్షల 69 వేల 719 మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష నేపథ్యంలో పక్కా ఏర్పాట్లు చేయడం జరిగిందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ్ కమిషనర్ గిరిజా శంకర్ వెల్లడించారు.

దూర ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులకు ఉచితంగా భోజనం, వసతి సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఇక పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు నిమిషం ఆలస్యంగా వచ్చినా..అనుమతించబోమని స్పష్టం చేశారాయన. 13 జిల్లాల్లో 5 వేల 314 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలు నిర్వహించే రోజుల్లో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపనుంది. ఉదయం నిర్వహించే పరీక్షపై అదే రోజు సాయంత్రం, మధ్యాహ్నం నిర్వహించే పరీక్షలపై మరుసటి రోజు ఉదయం కీ విడుదల చేయనున్నారు.

అభ్యంతరాలకు ఆన్ లైన్‌‌లో నమోదు చేయవచ్చు. ఇందుకు మూడు రోజుల సమయం ఇచ్చారు. అభ్యర్థులు ఎవరినీ నమ్మి మోసపోవద్దని..ప్రశ్నాపత్రం లీక్ కావడం, ఇతక అక్రమాలు చోటు చేసుకోవడానికి ఆస్కారం లేదని అధికారులు చెబుతున్నారు. అక్టోబర్ 01వ తేదీన ఫలితాలు విడుదల చేస్తామని వెల్లడిస్తున్నారు.