గుడివాడ‌లో గెలిచేదెవ‌రు : కొడాలి నాని Vs దేవినేని అవినాష్

  • Published By: madhu ,Published On : March 18, 2019 / 10:28 AM IST
గుడివాడ‌లో గెలిచేదెవ‌రు : కొడాలి నాని Vs దేవినేని అవినాష్

టీడీపీ వ్యవస్థాపకుడు NTR ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. కృష్ణా జిల్లా గుడివాడకు ఉమ్మడి ఏపీలోనూ ప్రత్యేక స్థానం ఉంది. టీడీపీ, వైసీపీ తరపున దిగ్గజాలు ఎన్నికల బరిలో తలపడుతుండటంతో ఇక్కడి ఫలితాలపై సర్వత్రా ఆసక్తి ఏర్ప‌డింది. ఇక్కడ మొత్తం ఓటర్లు లక్షా 99 వేల 293 మంది. మహిళా ఓటర్లే అత్యధికం. టీడీపీ ఆవిర్భావానికి ముందు కాంగ్రెస్, వామపక్షాల మధ్య పోటీ ఉండేది. ఎక్కువసార్లు కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. టీడీపీ స్థాపించిన తర్వాత 10సార్లు ఎన్నికలు జరిగాయి. 8సార్లు టీడీపీ అభ్యర్థులే గెలుపొందారు. 1989లో కాంగ్రెస్, 2014 వైసీపీ అభ్యర్థి ఎన్నికయ్యారు. 

1983లో NTR గుడివాడ ఎమ్మెల్యేగా ఎన్నికై సీఎంగా పనిచేశారు. 1985లో మధ్యంతర ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై సీఎంగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత తిరుపతి స్థానం ఉంచుకుని గుడివాడకు రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా రావి శోభనాద్రీ చౌదరి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచారు. 1989లో రావి శోభనాద్రీ చౌదరి సమీప కాంగ్రెస్ అభ్యర్థి కఠారి ఈశ్వర్ కుమార్ చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. 1994లో టీడీపీ అభ్యర్థి రావి శోభనాద్రీచౌదరి, కఠారి ఈశ్వర్ కుమార్‌పై పోటీ చేసి గెలుపొందారు. 1999లో రావి శోభనాద్రీ చౌదరి తనయుడు రావి హరిగోపాల్ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన  కాంగ్రెస్ అభ్యర్థి శేగు వెంకటేశ్వర్లుపై గెలుపొందారు. నెల రోజులకే హరి గోపాల్ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఉపఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో రావి సోదరుడు వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ అభ్యర్థి శిష్లా రమేష్ పై విజయం సాధించారు. 

2004లో టీడీపీ తరపున కొడాలి నాని పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కఠారి ఈశ్వర్ కుమార్‌పై విజయం సాధించారు. 2009లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కొడాలి నాని కాంగ్రెస్ అభ్యర్థి పిన్నమనేని వెంకటేశ్వరరావుపై గెలిచారు. 2014 ఎన్నికలకు ముందు కొడాలి నాని టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఆ పార్టీ తరపున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి రావి వెంకటేశ్వరరావుపై గెలుపొందారు. ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున దేవినేని అవినాష్, వైసీపీ తరపున కొడాలి నాని తలపడబోతున్నారు.