వెదర్ అప్ డేట్ : కోస్తాకు అతి భారీ వర్ష సూచన

దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడుకు ఆనుకుని ఉన్న నైరుతీ, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా అల్పపీడనం ఏర్పడదింది. 2019, అక్టోబర్ 24వ తేదీ బుధవారానికి మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఏపీ తీరం వైపుగా వచ్చే అవకాశాలున్నాయని, దీని ఫలితంగా కోస్తా జిల్లాల్లో అతి తీవ్ర, అతి భారీ, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కోస్తాలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే సూచనలున్నాయని తెలిపారు. గురువారం సైతం ఇదే పరిస్థితి ఉంటుందన్నారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయుగుండంగా మారే క్రమంలో తీవ్ర అల్పపీడనం.. కోస్తాంధ్ర తీరం వైపుగా కదులుతుంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో కురిసిన వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విజయనగరం, పశ్చిమగోదావరి, విశాఖపట్టణంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేక లేకుండా వానలు పడుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా డెల్టా మండలాల్లో పలు ప్రాంతాల్లో పొలాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. ఆక్వా రైతులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. కష్టపడి పండించిన పంటలు నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వాతావరణ అధికారుల హెచ్చరికలతో వీరిలో ఆందోళన వ్యక్తమౌతోంది.
Read More : అఖిల ప్రియ ఆగ్రహం : నా భర్తను, కుటుంబాన్ని ఎస్పీ టార్గెట్ చేశారు