రాయలసీమలో భారీ వర్షాలు : కుందూ నది ఉగ్రరూపం

రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని RTGS తెలిపింది. మూడ్రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవనున్నట్లు స్పష్టం చేసింది. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రమంతటా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే చిత్తూరు, కడప, అనంతపురం, కృష్ణాజిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు. కృష్ణా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయని తెలిపింది. ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని వెల్లడించింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతాయని చెప్పింది. ప్రజలు వాగులు దాటే సాహసం చేయరాదని సూచించింది. వర్షాలు కురిసే సమయంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ నిపుణులు సూచించారు.
మరోవైపు కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులూ వంకలూ పొంగిపొర్లుతున్నాయి. కుందూనది ఉగ్రరూపం దాల్చింది. మిడుతూరు మండలం తలముడిపి గ్రామ సమీపంలో రహదారిపై వరదనీరు పారుతోంది. దీంతో రాకపోకలు స్ధంభించాయి. కుందూనది పరివాహక ప్రాంతంలో వేసిన వేల ఎకరాల పంటలు నీట మునిగాయి. ఉల్లి, మొక్కజొన్న, పత్తి పంటలు నీటమునగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. భారీ వర్షాలకు జలకనూరు గ్రామంలో ఇళ్లలోని నీరు చేరింది. దీంతో ఇంట్లో వస్తువులన్నీ నీటమునిగాయి.
నిత్యవసర సరుకులు కూడా నీట మునగడంతో ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. అటు నందికొట్కూరు మండలంలోనూ మోకాల్లోతులో నీరు చేరింది. అటు బ్రాహ్మణకొట్కూరు గ్రామంలో తుప్పట్ల వాగు పొంగడంతో కర్నూలు-గుంటూరు రహదారిలో రాత్రంతా రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరిపిలేని వర్షాలకు నెహ్రూనగర్ గ్రామంలో మట్టి మిద్దెలు కూలిపోయాయి. అయితే అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదు.
Read More : హైదరాబాద్ మెట్రో బెటర్ : ఎలాంటి అనుమానాలు వద్దు – కేటీఆర్