అరెస్ట్ చెయ్యాల్సింది వాళ్లను కదా? : విశాఖ ఘటనపై హైకోర్టు సీరియస్

విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో పోలీసుల తీరుపై హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు తదుపరి విచారణను మార్చి 2వ తేదీకి వాయిదా వేసింది. ఈ సంధర్భంగా అధికార పక్షానికి ఒక రూలు ప్రతిపక్షానికి మరో రూలు ఉంటుందా చట్టం ముందు అందరూ సమానమే కదా? షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన తరువాత 151 కింద నోటీసులు ఎందుకిచ్చారు? అంటూ హైకోర్టు ప్రశ్నించింది.
ఒక వ్యక్తి నేరం చేయకుండా ఉండేందుకు, అతన్ని అదుపు చేసేందుకు 151 సెక్షన్‌ను ఉపయోగించాలని.. నోటీసు ఇచ్చిన ప్రకారం చూస్తే ఈ కేసు వ్యవహారం అలా లేదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. సెక్షన్ 151 కింద ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నట్లు నోటీసు ఎలా ఇచ్చారని పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది.
అలాగే ‘ముందస్తు అరెస్ట్ చేయాల్సింది రాళ్లు, కోడిగుడ్లు వేయడానికి వచ్చిన వాళ్లని కదా? ఆందోళనకారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎయిర్‌పోర్టుకు రాకుండా వాళ్లని ఎందుకు నిలువరించలేకపోయారు..?’ అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వచ్చే నెల 2వ తేదీన కోర్టులో కౌంటర్ దాఖలు చేయాలని డీజీపీ, విశాఖ సీపీలను హైకోర్టు ఆదేశించింది.