వైసీపీ ఎంపీ అభ్యర్థి ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు

గుంటూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు కొన్ని గంటల ముందు గుంటూరులో ఐటీ సోదాల కలకలం చెలరేగింది. గుంటూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇళ్లు, ఆఫీసులపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఏక కాలంలో 3 చోట్ల సోదాలు నిర్వహించారు. బుధవారం(ఏప్రిల్ 10, 2019) రాత్రి పట్టాభిపురంలోని ఆయన ఇంటితో పాటు, బృందావన్ గార్డెన్స్ లోని ఆయన కార్యాలయంలోనూ, మోదుగుల చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ సుధాకర్‌రెడ్డి నివాసంలోనూ ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఐటీ అధికారులు వచ్చినప్పుడు మోదుగుల ఇంటిలోనే ఉన్నారు.
రాత్రి 8 గంటల నుంచి సోదాలు కొనసాగాయి. ఐటీ దాడులకు తానే మాత్రం భయపడనని, దాడులతో తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని మోదుగుల చెప్పారు. పోలింగ్‌కు కొన్ని గంటల సమయం ఉండగా, తనను భయపెట్టేందుకే ఈ సమయంలో ఐటీ దాడులు చేపట్టారని ఆయన ఆరోపించారు. ఐటీ అధికారులు మోదుగుల ఎన్నికల ఖర్చుపై ఆరా తీశారు. మోదుగుల బ్యాంకు ఎకౌంట్లను, నగదు తరలింపు వంటి విషయాలపై ఆరా తీశారు.