యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు

భక్తుల కోరిన కోర్కెలు తీరుస్తూ కోరినవారికి కొంగుబంగారంగా మారిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా మూడు రోజుల పాటు జరగనున్నాయి.యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో బుధవారం(15 మే 2019) నుంచి మూడు రోజుల పాటు స్వామివారి జయంతి ఉత్సవాలు జరిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం 9 గంటలకు ఉదయం 9.00 గంటలకు యాగశాల ప్రవేశం, స్వస్తీవాచనము, పుణ్యాహావాచనము, విశ్వక్సేనారధన, రుత్విక్వరణము, రక్షాబంధనమలు, అంకుర్పాణము, మూర్తి కుంభ స్థాపన, దివ్య ప్రబంధ, చతుర్వేద, మూలమంత్ర, మూర్తి మంత్ర, జప పారాయణములు, అగ్ని ప్రతిష్ట యజ్ఞ ప్రారంభము జరుగుతాయి. ఉదయం 10.30 గంటలకు లక్ష పుష్పార్చన యాగమండపములో నిర్వహిస్తారు.
టిక్కెట్ వెల రూ. 1, 116 దంపతులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఉదయం 11: 30 గంటలకు శ్రీ వెంకటపతి అలంకారసేవ, సాయంత్రం 6:30 గంటలకు మృత్యంగ్రహణం, అంకురారోపణం, రాత్రి 8: 30 గంటలకు గరుడవాహనంపై పరవాసుదేవ అలంకారసేవ నిర్వహిస్తారు. 16వ తేదీ గురువారం రెండో రోజు ఉదయం 7 గంటలకు నిత్యహవనమలు, మూలమంత్ర, మూర్తిమంత్ర జపపారాయణములు, లక్షకుంకుమార్చన ఉదయం 9.30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఉదయం 11: 30 గంటలకు కాళీయ మర్ధనం అలంకారసేవ, రాత్రి 8:30 గంటలకు హనుమంతవాహనంపై రామావతారం అలంకారసేవ నిర్వహిస్తారు.
అలాగే 17వ తేదీ శుక్రవారం నాడు ఉదయం 7 గంటలకు నిత్యహవనము, మూలమంత్ర పారాయణములు, జపములు, సహస్రఘటాభిషేకము, ఆరాధన, ఆవాహన మహా పూర్ణాహుతి, నృసింహ జయంతి సందర్భంగా ఉదయం 7.30 గంటల నుంచి శ్రీస్వామివారి సహస్రఘటాభిషేకము నిర్వహింపబడుతుది. టికెట్ ధర రూ.2,000 ఉంటుంది. రాత్రి 7 గంటలకు శ్రీస్వామివారి జయంతిమహోత్సవము, నృసింహ అవతార అలంకారము, అవతార వైభవ ప్రవచనము, రాత్రి 9.00 గంటలకు తీర్థప్రసాద గోష్టి ఉత్సవ పరిసమాప్తి అవుతుంది. శ్రీలక్ష్మీనరసింహస్వామివారి జయంతి ఉత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు భక్తులను అలరిచేందుకు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ మూడు రోజులు శాశ్వత, నిత్య కల్యాణాలు, బ్రహ్మోత్సవాలు, సుదర్శన హోమాలు నిర్వహించబడవు.
ఉత్సవాలను పురస్కరించుకుని అధికారులు మూల మంత్ర జపాలను నిర్వహించడానికి 20 మంది రుత్విక్కులకు ఆహ్వానాలు పంపారు. సహస్ర కలశాభిషేకాలకు కలశాలను సిద్ధం చేశారు. యాదాద్రి దేవస్థానంలో బుధవారం నుంచి బెల్లం లడ్డూల విక్రయాలు ప్రారంభిస్తున్నట్లు ఆలయ ఈఓ గీతారెడ్డి వెల్లడించారు. లడ్డూ విషయంలో వారం రోజులుగా ట్రయల్‌రన్ చేసి నివేదికను దేవాదాయ శాఖ కమిషనర్‌కు పంపామని, వంద గ్రాముల లడ్డూ రూ.25గా ధర నిర్ణయించినట్లు చెప్పారు. ప్రసాదాల కౌంటర్ల ద్వారానే లడ్డులను కూడా అమ్మనున్నట్లూ ఈఓ తెలిపారు.