కడపలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహిస్తాం:కలెక్టర్

ఎన్నికలకు ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండటంతో ఆయా జిల్లాల కలెక్టర్లు సమాయత్తమవుతున్నారు. కడప జిల్లాలో ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు . జిల్లాలోని సుమారు 22లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కోరిన దాని కన్నా 40శాతం తక్కువ పోలీసు బలగాలు ఉన్నప్పటికీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తామని కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్ ధీమా వ్యక్తం చేశారు.
కడప జిల్లాలోని కలెక్టరేట్‌లోని వీసీ హాలులో ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ హరికిరణ్ సమావేశమయ్యారు. జిల్లాలోని ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యల నడుమ ఈవీఎంలను తరలిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. 6900 వీవీ ప్యాట్స్‌ను అందుబాటులో ఉంచామన్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు అంధులకు బ్రెయిలీ భాషలో బ్యాలెట్ పత్రాలను సిద్ధం చేశామని చెప్పారు. జిల్లాలో 768 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని కెమెరాల నిఘాతో పాటు మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణలో ఎన్నికలను నిర్వహిస్తామని చెప్పారు.
కడపజిల్లా జిల్లాలో సుమారు 22లక్షల మంది పైగా ఓటర్లు ఉండగా వారిలో మహిళలు దాదాపు 11 లక్షలమంది… పురుషులు 11 లక్షలమందికి పైగా ఉన్నారని హరికిరణ్ చెప్పారు. ఇక కడప జిల్లాలోని 10 నియోజకవర్గాలకు కలిపి 133 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారన్నారు. కడప పార్లమెంట్‌లో 15మంది అభ్యర్థులు ఉండగా వీరిలో రాజంపేట పార్లమెంట్‌లో 9మంది బరిలో ఉన్నారని అన్నారు. జిల్లాలో 2వేల726 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ చెప్పారు. 18వేల788 మంది సిబ్బందిని నియమించామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2వేల722 పోలింగ్ కేంద్రాల్లో 18వేల మంది ఎన్నికల సిబ్బంది, 3500మంది పోలీస్ లు విధుల్లో పాల్గోనున్నట్లు ఆయన తెలిపారు.