పూర్ణాహుతి : కేసీఆర్ చండీయాగం ముగిసింది

సిద్ధిపేట : సహస్ర మహా చండీయగము ఐదో రోజు..చివరి రోజు పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. మొత్తం 8 మంటపాలలో పూర్ణాహుతి జరిగింది. విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సరస్వతి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు ప్రతీ మంటపానికి వెళ్లి పూర్ణాహుతిలో పాల్గొన్నారు. రాజశ్యామల మంటపం, బగలాముఖి మంటపం, నవగ్రహ, ఋగ్వేద, యజుర్వేద, సామవేద అధర్వణ వేద మంటపాలలో తొలుత పూర్ణాహుతి జరిగింది.
8 మంటపాలు :
ఈ 8 మంటపాలలో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత ప్రధాన యాగశాల అయిన చండీమాత మహా మంటపంలో పూర్ణాహుతి ప్రారంభం అయింది. జనవరి 25వ తేదీ శుక్రవారం ఉదయం యధావిధిగా ముఖ్యమంత్రి దంపతులు మొదట రాజశ్యామలాదేవి మంటపంలో పూజలు నిర్వహించారు. నమస్తత్వమే రాజశ్యామల మాతకీ జై అంటూ వేదపండితులు చేసిన మంత్రోచ్ఛరణం మధ్య పూజలు చేశారు. అక్కడ ఋత్వికులు నిర్వహిస్తున్న పూర్ణాహుతిలో పాల్గొన్నారు.
బగలాముఖి దేవి మంటపంలో జరిగిన పూజల్లో వేదపండితులు జయ పీతాంబర ధారణి, దివ్య వేదోక్త మహా నీరాజనం సమర్పయామి అంటూ పూజలు చేశారు. నవగ్రహ మంటపంలో, మహారుద్ర మంటపంలో, చతుర్వేద మంటపాలలో కూడా పూర్ణాహుతి జరిగింది. సహస్ర శీర్షా, పురుష సంవేద పుష్పమాం, పుష్ప మాలికాం సమర్పయామి, సౌభాగ్య ద్రవ్య సమర్పయామి అంటూ పూర్ణాహుతి నిర్వహించారు.