ఫాలో ఫాలో యు : తండ్రి బాటలోనే కేటీఆర్

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కేసీఆర్‌ను ఫాలో అవుతున్నారు. అటు రాజకీయాన్ని.. ఇటు సెంటిమెంట్‌ను అనుసరిస్తూ తండ్రి బాటలోనే అడుగులేస్తున్నారు. కేసీఆర్ సెంటిమెంట్‌కు అనుగుణంగా.. ఉత్తర తెలంగాణ నుంచి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలను ప్రారంభించనుండడం ఇప్పుడు హట్ టాపిక్ గా మారింది. సెంటిమెంట్ కు అధిక ప్రాధాన్యతనిచ్చే ముఖ్యమంత్రి కేసిఆర్ పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనుకున్నా ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచే మొదలు పెడతారు. ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాలన్నా, పార్టీ కార్యక్రమాలు ప్రారంభించాలన్నా కరీంనగర్ నుంచి శ్రీకారం చుట్టడం ఆనవాయితీ. ఇదే సెంటిమెంట్‌ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఫాలో
అవుతున్నారు. గులాబి పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు సన్నాహక సమావేశాలను అక్కడి నుంచే మొదలు పెట్టబోతున్నారు.
పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టిన టీఆర్ఎస్ పార్టీ అందుకు క్యాడర్‌ను సిద్ధం చేస్తోంది. మార్చి మొదటి వారంలో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండడంతో.. సన్నాహక సమావేశాలను ఏర్పాటు చేస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. 16 లోక్‌సభ స్థానాలే లక్ష్యంగా అడుగులు వేస్తున్న గులాబి దళపతి కేసిఆర్ సెంటిమెంట్‌కు అనుగుణంగా సమావేశాలను మొదలు పెడుతున్నారు. పార్టీకి కలిసి వచ్చిన జిల్లాగా పేరొందిన కరీంనగర్ నుంచి మార్చి ఒకటిన సన్నాహక సమావేశాలను ప్రారంభించనున్నారు.
పార్టీ ఆవిర్బావం నుంచి కూడా కరీంనగర్ నుంచే భారీ సభలను గులాబి పార్టీ మొదలు పెట్టింది. సింహగర్జన పేరుతో తొలి సభను టిఆర్ఎస్ అక్కడ నిర్వహించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలను కేసిఆర్ కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం నుంచే మొదలు పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యంతో అధికారం దక్కించుకున్నారు. ఉద్యమ సమయం నుంచి సెంటిమెంట్ పరంగా తమకు కలిసివచ్చిన జిల్లాగా కరీంనగర్ ను టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. దీంతో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలను ఇక్కడి నుంచే మొదలు పెడుతున్నట్లు మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు.