పోస్టర్ల కలకలం : ఎన్నికలను మావోలు టార్గెట్ చేశారా

పార్లమెంట్ ఎన్నికలను మావోయిస్టులు టార్గెట్ చేశారా… చత్తీస్‌గఢ్ దండకారణ్యంతో పాటు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాల్లో తమ కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఓవైపు భారీగా బలగాలు మోహరిస్తున్నాయి. ఎన్నికలు బహిష్కరించాలంటూ మావోయిస్టులు మాత్రం యదేచ్చగా పోస్టర్లు అంటిస్తుడటం కలకలం రేపుతోంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టుల కదలికలు ఎక్కువయ్యాయి. కొన్ని రోజులుగా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించాలంటూ పలు ప్రాంతాల్లో వెలుస్తున్న బ్యానర్లు, పోస్టర్లు, కరపత్రాలు కలకలం రేపుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలు సున్నితమైన ప్రాంతాలుగా ఉన్నాయి. అటు ఛత్తీస్‌గఢ్‌లో బీజాపూర్, సుక్మా, నారాయణపూర్, కాంకేర్ జిల్లాలో ఎక్కడో చోట ఎదురు కాల్పులు జరుగుతూనే ఉంటాయి. అయితే.. ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వాలు భారీగానే భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాయి. అయినా మావోయిస్టులు తమ కార్యకలాపాలను ఉధృతం చేస్తున్నారు. సరిహద్దు అటవీ ప్రాంతాలు, ఎజెన్సీలు దాటి.. జిల్లాల్లోని మైదాన ప్రాంతాలకు చొచ్చుకు వచ్చేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా… చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, మణుగూరు, పినపాక, పాల్వంచ ప్రాంతాల్లో మవోయిస్టు తెలంగాణ రాష్ర్ట కమిటీ పేరుతో కరపత్రాలు, బ్యానర్లు వెలుస్తున్నాయి.
బూటకపు పార్లమెంటరీ 17వ లోక్‌సభ ఎన్నికలను బహిష్కరించాలని.. అప్రజాస్వామిక పాలనకు వ్యతిరేకంగా పోరాడాలంటూ ఆ బ్యానర్లలో ఉంటోంది. అన్నీ దోపిడీ పార్టీలే కాబట్టి.. వాటిని తిప్పికొట్టాలని… నూతన ప్రజాస్వామ్య విప్లవాన్ని విజయవంతం చేయాలంటూ పోస్టర్లలో పేర్కొంటున్నారు. తరచూ పోస్టర్లు వెలుస్తుండటంతో… పోలీసులకు, నిఘా వ్యవస్థకు సవాల్‌గా మారుతోంది. ఈ పరిస్థితుల్లో.. మావోల ప్రాభల్యం ఉన్న ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. గట్టి నిఘా ఏర్పాటు చేయడమే కాకుండా కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
అటు సరిహద్దుల్లోనూ భద్రతను పెంచుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అనుమతి లేకుండా ప్రచారానికి వెళ్లొద్దంటూ పోలీసులు సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు రాష్ట్రాల సరిహద్దుల ఉన్నతాధికారులు సమావేశమవుతూ.. సమన్వయం చేసుకుంటున్నారు. మావోయిస్టుల ప్రాబల్యం తగ్గించి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తూనే… తనిఖీలు ముమ్మరం చేశారు.