శ్రీదేవిని వెతికిపెట్టండి.. మిస్సింగ్ కేసు పెట్టిన రాజధాని మహిళలు

మూడు రాజధానులు అంశంపై జగన్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని ప్రాంత రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కనిపించట్లేదంటూ ఆ ప్రాంత రైతు కుటుంబాల్లోని మహిళలు పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టారు. తమ సమస్యల్ని ఎమ్మెల్యేకు చెబుదామనుకుంటే ఆమె కనిపించట్లేదని.. ఇల్లు, కార్యాలయం దగ్గర వెతికినా కనిపించట్లేదని వారు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే ఎమ్మెల్యేను వెతికి పెట్టాలంటూ మహిళలు పోలీసులను కోరారు. ఈ మేరకు మహిళలు తుళ్లూరు పోలీసులకు వినతిపత్రాన్ని అందజేశారు. ఉండవల్లి శ్రీదేవి గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు.
రాజధాని విషయంలో ప్రభుత్వం గందరగోళం సృష్టించిందని, ఈ విషయంలో ఆందోళనగా ఉన్నట్లు చెప్పారు మహిళలు. సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటన చేసిన తర్వాత నుంచి తమ ఎమ్మెల్యే కనిపించట్లేదని చెబుతున్నారు. ఆమె ఎక్కడికి వెళ్లిందో తెలియదని వారు అంటున్నారు.
తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై మాత్రమే కాదు.. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై కూడా రైతులు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం జగన్ ప్రకటన చేసిన తర్వాత రాజధాని ప్రాంత ఎమ్మెల్యేలు దాదాపుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేలు ఎక్కడున్నారా? అని రైతులు వెదుకుతున్నారు. ఇప్పుడు రాజధాని గ్రామాల్లో పార్టీలతో సంబంధం లేకుండా ఉద్యమం తీవ్రతరం అయ్యింది.