Ghaati Review : ‘ఘాటి’ మూవీ రివ్యూ.. అనుష్క చాన్నాళ్లకు చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమా ఎలా ఉందంటే..?

అనుష్క చాన్నాళ్లకు చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమా ఎలా ఘాటి ఎలా ఉంది..(Ghaati Review)

Ghaati Review : ‘ఘాటి’ మూవీ రివ్యూ.. అనుష్క చాన్నాళ్లకు చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమా ఎలా ఉందంటే..?

Ghaati Review

Updated On : September 5, 2025 / 12:58 PM IST

Ghaati Review : అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు జంటగా తెరకెక్కిన సినిమా ‘ఘాటి’. UV క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మాణంలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఘాటి సినిమా నేడు సెప్టెంబర్ 5న థియేటర్స్ లో రిలీజయింది. జగపతి బాబు, చైతన్య రావు, రవీంద్ర విజయ్.. పలువురు కీలక పాత్రలు పోషించారు.

కథ విషయానికొస్తే.. ఒరిస్సా – ఆంధ్ర బోర్డర్లో ఉన్న తూర్పు కనుమల్లో గంజాయి సాగు జరుగుతుంది. ఆ కొండలు, అడవుల్లోంచి గంజాయిని కోసి మోసుకొచ్చి వాటిని రెడీ చేసి ఆ గంజాయి బిజినెస్ చేస్తున్న వారికి ఇచ్చే వాళ్ళని ఘాటీలు అంటారు. ఆ అడవుల్లో నాలుగు రకాల గంజాయి దొరుకుతుంది. అందులో శీలావతి బెస్ట్ క్వాలిటీ దానికి రేట్ ఎక్కువ. శీలావతి(అనుష్క), ఆమె బావ దేశి రాజు(విక్రమ్ ప్రభు) కూడా ఒకప్పుడు ఘాటీలే. కానీ దేశీరాజు తండ్రి చనిపోవడంతో తల్లికి మాట ఇచ్చి ఘాటి పని మానేస్తారు. శీలావతి బస్ కండెక్టర్ గా, దేశి రాజు ల్యాబ్ టెక్నిషియన్ గా పనిచేసుకుంటూ ఉంటారు. మరోవైపు పోలీసాఫీసర్(జగపతి బాబు) గంజాయిని ఆపాలని చూస్తూ ఉంటాడు.

అయితే ఈ గంజాయి వ్యాపారం చేసుకునే గ్యాంగులకు తెలియకుండా దేశీ రాజు, శీలావతి కలిసి శీలావతి రకం గంజాయిని ఉపయోగించి కొత్త రకం లిక్విడ్ కనిపెట్టి బిజినెస్ చేస్తూ ఉంటారు. దాంట్లో కోట్ల డబ్బు వస్తుంది. ఈ విషయం ఆ ఏరియా గంజాయి బిజినెస్ చేసే క్యాస్ట్రాల్ నాయుడు(రవీంద్ర విజయ్) అతని తమ్ముడు కుందుల నాయుడు(చైతన్య రావు)లకు తెలుస్తుంది. మొదట పార్టనర్ షిప్ అని నమ్మిస్తారు కానీ వీళ్ళిద్దరూ కలిసి దేశీ రాజుని చంపేస్తారు. దీంతో శీలావతి ఏం చేసింది? అసలు గంజాయి ముట్టుకోను అని మాట ఇచ్చి మళ్ళీ గంజాయి బిజినెస్ ఎందుకు చేసారు? పోలీసాఫీసర్ గంజాయిని ఆపాడా? ఘాటీలు గంజాయి పని తప్ప వేరే పని చేయరా? శీలావతి రివెంజ్ తీర్చుకుంటుందా? అసలు శీలావతికి గంజాయి పేరు ఎందుకు పెట్టారు?  ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Little Hearts Review : ‘లిటిల్ హార్ట్స్’ మూవీ రివ్యూ.. వామ్మో.. పడీ పడీ నవ్వాల్సిందే..

సినిమా విశ్లేషణ..

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయిన అనుష్క ఇప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తుంది. అనుష్క చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాతో వచ్చింది. సినిమా మొదట్లో గంజాయి వల్ల బయట ఎంత మంది ఎఫెక్ట్ అవుతున్నారు అని కొని సీన్స్ చూపించి లీడ్ ఇచ్చారు కానీ అవి కథకు లింక్ చేయలేదు. ఫస్ట్ హాఫ్ అంతా సింపుల్ గా దేశి రాజు – శీలావతి లవ్ స్టోరీతో, ఘాటీల సీన్స్ తో సాగుతుంది. ఘాటీల గురించి, గంజాయి వ్యాపారాలు, వాళ్ళ బిజినెస్ గురించి చూపిస్తారు. ఇంటర్వెల్ కి దేశీ రాజు – శీలావతి కలిసి కొత్త బిజినెస్ చేస్తున్నారని తెలియడం, విలన్స్ కి వీళ్లకు మధ్య గొడవ, దేశీ రాజు మరణంతో సెకండ్ హాఫ్ పై కాస్త హైప్ నెలకొంటుంది.

ఇక సెకండ్ హాఫ్ అంతా యాక్షన్ మోడ్. శీలావతి తన బావని చంపేసినందుకు రివెంజ్ ఎలా తీర్చుకుంది అనే సాగుతుంది. చివర్లో మళ్ళీ హీరోయిన్ వచ్చి ఓ నాలుగు మంచి మాటలు చెప్పి జనాల్ని మార్చడం లాంటి రొటీన్ సీన్స్ పెట్టారు కానీ వాటిని కన్వీన్స్ గా చెప్పలేకపోయారు. సినిమా మొదట్లో గంజాయి ఎఫెక్ట్ సీన్స్ మనకు చూపించారు కానీ గంజాయి వల్ల ఎంత నష్టం జరుగుతుంది సమాజంలో అనేది కథకు లింక్ చేసి చెప్పలేకపోయారు. దీంతో శీలావతి ఇచ్చే స్పీచ్ లకు అర్ధం ఉండదు.

సెకండ్ హాఫ్ అంతా అనుష్క ని ఎలివేట్ చేయడానికే సీన్స్ పెట్టినట్టు అనిపిస్తుంది. ఎక్కువ ఎలివేషన్స్, విజువల్స్, గ్రాండియర్ మీద దృష్టి పెట్టి ఎమోషన్, కథ మీద సరిగ్గా ఫోకస్ చేయలేదు అనిపిస్తుంది. కథనం పరంగా నెక్స్ట్ ఏం జరుగుతుందో ప్రతి సీన్ మనం ఊహించేయొచ్చు. సామాజిక వ్యతిరేక కార్యకలాపాల్లో పనిచేసే ఓ వ్యక్తి తన వాళ్ళు చనిపోవడంతో తన పైన ఉన్న వాళ్ళను వ్యతిరేకించి మంచి చేద్దామని ఎలా ఎదిగారు అనే రెగ్యులర్ కథను గంజాయి, తూర్పు కనుమలు బ్యాక్ డ్రాప్ లో కొత్తగా చూపించే ప్రయత్నం చేసారు. సినిమా అంతా అయ్యాక క్రిష్ సినిమాల్లో ఉండే సోషల్ మెసేజ్ మార్క్ మిస్ అయినట్టు అనిపిస్తుంది.

Ghaati Review

నటీనటుల పర్ఫార్మెన్స్..

అనుష్క చాన్నాళ్ల తర్వాత యాక్షన్ సీక్వెన్స్ లలో అదరగొట్టేసింది. ఎలివేషన్స్ కూడా భారీగా ఇవ్వడంతో అనుష్క స్క్రీన్ ప్రజెన్స్ బాగుంటుంది. చైతన్య కృష్ణ నెగిటివ్ పాత్రలో అదరగొట్టాడు కానీ ఎంతసేపూ అవసరం లేకపోయినా అరుస్తూ ఉంటూ ఇరిటేషన్ తెప్పిస్తాడు. అది చివరికి వచ్చేసరికి కామెడీగా అనిపిస్తుంది. రవీంద్ర విజయ్ నెగిటివ్ పాత్రలో బాగానే మెప్పించాడు. విక్రమ్ ప్రభు అనుష్క పక్కన ప్రేమికుడిగా బాగానే మెప్పిస్తూ ఘాటీగా కూడా బాగానే సెట్ అయ్యాడు. జగపతి బాబు పోలీస్ పాత్రలో పర్వాలేదనిపించారు. డ్యాన్స్ మాస్టర్ రాజు సుందరం ఓ కీలక పాత్రలో బాగానే మెప్పించారు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలదనిపించారు.

Also Read : Ghaati Twitter Review : ‘ఘాటి’ ట్విటర్ రివ్యూ.. యాక్షన్ సీన్లలో అనుష్క బీభత్సం!

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్, లొకేషన్స్ ఈ సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. ఒరిస్సా ఆంధ్ర బోర్డర్ లో తూర్పు కనుమలు , అక్కడ కొండలు, అడవులు, గుహలు.. అన్ని చాలా బాగా చూపించారు. సినిమాటోగ్రఫీ విజువల్స్ అయితే చాలా బాగుంటాయి. కొన్ని షాట్స్ కోసం బాగానే కష్టపడ్డారని తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ షార్ప్ ఎడిటింగ్ చేస్తే బాగుండేది. కథ రెగ్యులర్ అయినా దాని బ్యాక్ డ్రాప్ కొత్తగా తీసుకొని అద్భుతమైన విజువల్ తో తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా మాత్రం సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది.

మొత్తంగా ‘ఘాటి’ సినిమా గంజాయి మోయడంలో మునిగిపోయిన ఘాటీల జీవితం కథ. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

 

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.