రోజూ టీవీల్లో కనిపించటానికా ధర్నాలు: 70ఏళ్లనుంచి మాకు లేని రాజధాని బాధ మీకెందుకు?

  • Published By: veegamteam ,Published On : December 24, 2019 / 08:32 AM IST
రోజూ టీవీల్లో కనిపించటానికా ధర్నాలు: 70ఏళ్లనుంచి మాకు లేని రాజధాని బాధ మీకెందుకు?

Updated On : December 24, 2019 / 8:32 AM IST

రాజధాని అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న ధర్నాపై ఎమ్మెల్యే  ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. రైతులు చేస్తున్న ఆందోళన ఉద్యమం అంతా బోగస్ అనీ..వారి ఆందోళనల్ని పట్టించుకోవాల్సి పనిలేదని అన్నారు.  అమరావతి గ్రామాల్లో చేస్తున్న ఉద్యమం అంతా నాటకమనీ..అదంతా టీడీపీ కార్యకర్తలు చేస్తున్న పనులేనని విమర్శించారు. 

70 ఏళ్లుగా మాకు తాగటానికి గుక్కెడు గంజికూడా కూడా లేదనీ అటువంటి దుర్భర బతుకులు బతుకుతున్న తమకు లేని పోరాటాలు మీకెందుకు? అంటూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రశ్నించారు. రైతుల దగ్గర తీసుకున్న భూముల్ని ప్లాట్లుగా అభివృద్ధి చేసి ఇస్తామంటుంలే ఇంకా ఈ ఆందోళనలేంటి? రాజధాని అమరావతిపేరుతో ఈ రాజకీయాలేంటి? అంటూ మండిపడ్డారు.

ఆందోళన చేసేవారు అసలు రైతులే కాదనీ..లింగు లింగు మంటూ ఎనిమిది గ్రామాలవారు కూడా ఆందోళన చేపట్టినవారిలో లేరనీ..వారంతా రోజు టీవీల్లో కనిపిస్తుంటే అదే ఉద్యమం అని ఫీలైపోతున్నారనీ ధర్మాన ఎద్దేవా చేశారు. రోజూ టీవీల్లోను..పేపర్లలోను కనిపించటానికి వారు చేస్తున్న ధర్నాలని ధర్మాన హేళన చేశారు. 

కాగా ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనతో అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు గత ఆరు రోజుల నుంచి రోడ్లపై నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. మహిళలు, చిన్నారులు కూడా ఈ నిరసన కార్యక్రమాలలో పాల్గొన్నారు. విద్యార్దులు సైతం ఆందోళనల్లో పాల్గొంటున్నారు.