శబరిమలకు ఎందుకు వెళ్లకూడదని అడిగిన అన్నా లెజినోవో.. పవన్ కళ్యాణ్ సమాధానం ఇదే!

హిందూ ధర్మానికి అన్యాయం జరిగితే ఒప్పుకునే ప్రసక్తే లేదని అన్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం తిరుపతి పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన జీవితంలో జరిగిన ఆసక్తికర విషయం గురించి చెప్పారు. తిరుపతిలో తన పార్టీ కార్యకర్తలతో సమావేశమైన సంధర్భంగా మాట్లాడుతూ.. శబరిమలలో మహిళల ప్రవేశం గురించిన ప్రస్తావన తన భార్యకు తనకు వచ్చినప్పుడు తన భార్యకు ధర్మం గురించి సింపుల్‌గా చెప్పినట్లు వెల్లడించారు.
ఒక్కో మతానికి ఒక్కో ధర్మం ఉంటుందని, దానిని అందరూ పాటించాల్సిందేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శబరిమల గురించి తన భార్య అన్నా లెజినోవో తనను ప్రశ్నించిన విషయాన్ని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. శబరిమలకు తానెందుకు వెళ్లరాదని అన్నా లెజినోవో తనను అడిగిందని, దానికి ‘నువ్వు చర్చికి వెళ్లినప్పుడు తలపై చీర కొంగును ఎందుకు కప్పుకుంటావు?” అని అడిగానన్నారు. దానికి సమాధానంగా లెజినోవా అది తమ సంప్రదాయమని చెప్పింది అని అన్నారు.
మీకు క్రైస్తవంలో ఆ సంప్రదాయం ఎలానో.. హిందూ ధర్మంలో ఇది సంప్రదాయం అని అన్నారు. ఒక్కో ధర్మానికి ఒక్కో ఆచారం ఉంటుందని, ఆచారాలను పాటించాల్సిందే అని చెప్పినట్లు చెప్పారు. అయ్యప్పస్వామి బ్రహ్మచారని, అనునిత్యమూ తపస్సులో ఉంటారు కాబట్టే, మహిళలను ఆయన చూడరని, అందువల్లే మహిళలకు అక్కడ ప్రవేశం లేదని తన భార్యకు వివరించినట్లు వెల్లడించారు పవన్ కల్యాణ్. భావోద్వేగాలను రెచ్చగొట్టాలని చూసే కొందరు శబరిమలపై కోర్టును ఆశ్రయించి రాజకీయం చేస్తున్నారని, ఆలయ వివాదంపై తన తల్లి కూడా బాధపడిందని తెలిపారు పవన్ కళ్యాణ్.