ఓ లింగా : పెద్దగట్టు జాతరలో భక్తజన సందోహం

సూర్యాపేట జిల్లా దురాజ్ పల్లి పెద్దగట్టులో లింగమంతుల జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కేసారం నుంచి దేవరపెట్టెను పెద్దగట్టు మీదకు తరలించడంతో ఫిబ్రవరి 24వ తేదీ ఆదివారం రాత్రి లింగమంతుల జాతర వేడుకలు స్టార్ట్ అయ్యాయి. 5 రోజుల పాటు జాతర కొనసాగుతుంది. మంత్రి జగదీశ్ రెడ్డి పూజల అనంతరం కేసారం నుండి కాలి నడకన దేవరపెట్టెతో పెద్దగట్టుకు బయలుదేరారు యాదవ రెడ్డి కులస్తులు. ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ కూడా పాల్గొన్నారు.
భేరి చప్పుళ్ళు..గజ్జల లాగులతో పాటు కత్తులు.. కటార్లతో యాదవ సోదరుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఓ లింగా.. ఓ లింగా అంటూ కేసారం మారుమోగింది. మంత్రి జగదీశ్ రెడ్డి ఆదేశాలతో 30 లక్షల మందికి అధికారులు సరిపడా ఏర్పాట్లు చేశారు.
వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 25 లక్షల పైగా భక్తులు జాతరకు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రాహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా.. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు.