చంద్రబాబు మళ్లీ సీఎం ఖాయం : సబ్బం జోస్యం

విశాఖ : ఏపీ ప్రజలు మరోసారి చంద్రబాబుకి పట్టంకట్టబోతున్నారని టీడీపీ నేత సబ్బం హరి అన్నారు. ఎన్నికల్లో టీడీపీకి మహిళలు సంపూర్ణ మద్దతిచ్చారని ఆయన చెప్పారు. రాజధాని అమరావతిని చంద్రబాబు బ్రహ్మాండంగా నిర్మిస్తున్నారని సబ్బం హరి ప్రశంసించారు. అమరావతి, పోలవరం నిర్మాణాలను తాను స్వయంగా చూసి వచ్చానని చెప్పారు. రాజధాని కట్టడం ఎంత కష్టమో తనకు తెలుసు అన్నారు. అమరావతి నిర్మాణం గ్రాఫిక్స్ అని వెకిలిగా మాట్లాడుతున్నారని సబ్బం హరి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నిర్మాణంలో తెలుగు ప్రజల కృషి ఉందని సబ్బం హరి అన్నారు. హైదరాబాద్ లాంటి మరో రాజధానిని కట్టాలంటే అది చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. ఈ ఎన్నికల్లో హోరాహోరి పోరులో కూడా టీడీపీ గెలవడానికి పూర్తి బాధ్యత చంద్రబాబుదే అని, ఇది ఆయన వ్యక్తిగత విజయం అని చెప్పారు. తాను కూడా భీమిలిలో గెలుస్తానని ధీమా వ్యక్తం చేసిన సబ్బం హరి, తన విజయానికి కూడా చంద్రబాబే కారణం అన్నారు.
చంద్రబాబుపై నమ్మకంతో రైతులు 33వేల ఎకరాలను ఇచ్చారని సబ్బం హరి చెప్పారు. కేంద్రం సహకరించికపోయినా చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబుకి ఎంత పట్టుదల ఉందో తనకు ప్రత్యక్షంగా అర్థమైందన్నారు. ఏపీలో బీజేపీ ఖాతా కూడా తెరవదని సబ్బం హరి తేల్చి చెప్పారు.