నారా లోకేష్‌కు గట్టి షాక్: మంగళగిరిలో మారిన రాజకీయం

నారా లోకేష్ తొలిసారి రాజధాని ప్రాంతమైన మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేస్తుండడంతో ఈ నియోజకవర్గం గురించి ప్రస్తుతం చర్చ జరుగుతుంది.

  • Published By: vamsi ,Published On : March 23, 2019 / 01:59 AM IST
నారా లోకేష్‌కు గట్టి షాక్: మంగళగిరిలో మారిన రాజకీయం

Updated On : March 23, 2019 / 1:59 AM IST

నారా లోకేష్ తొలిసారి రాజధాని ప్రాంతమైన మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేస్తుండడంతో ఈ నియోజకవర్గం గురించి ప్రస్తుతం చర్చ జరుగుతుంది.

ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ తొలిసారి రాజధాని ప్రాంతమైన మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేస్తుండడంతో ఈ నియోజకవర్గం గురించి ప్రస్తుతం చర్చ జరుగుతుంది. అయితే మంగళగిరి నియోజకవర్గంలో ఇటీవల కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం గూటికి చేరిన మహిళా నేత కాండ్రు కమల ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో నారా లోకేష్‌కు గట్టి షాక్ తగిలినట్లైంది.

నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించిన తరువాత 1983లోను ఆ తర్వాత 1985లో మాత్రమే మంగళగిరిలో టీడీపీ ఎన్నికయ్యింది. 1989 నుండి 2009 వరకు నాలుగు సార్లు కాంగ్రెస్ ఎదుట పరాజయం పాలయ్యింది. 1994లో టీడీపీ, సిపిఎం పొత్తులో భాగంగా సిపిఎం గెలిచింది. గత ఎన్నికల్లో కేవలం 12ఓట్ల ఆధిక్యంతో వైసీపీ నేత ఆళ్ళ రామకృష్ణ రెడ్డి టీడీపీ నేత గంజి చిరంజీవిపై ఇక్కడ నుంచి గెలుపొందారు. స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన కారణంగా గంజి చిరంజీవిపైన ప్రజల్లో సానుభూతి ఉంది. అయితే ఈసారి అతను కాకుండా నారా లోకేష్ ఇక్కడ నుండి పోటీ చేస్తున్నారు.
Read Also : వైసీపీ షాకింగ్ డెసిషన్ : హిందూపురం బరిలో గోరంట్ల మాధవ్ భార్య

మరోవైపు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి టీడీపీకి వ్యతిరేకంగా చేస్తున్న కార్యక్రమాలతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయారు. 2014కు ముందువరకు పెద్దగా ఎవరికీ తెలియని ఆళ్ల ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుండి వైసీపీని బలోపేతం చేస్తూ, టీడీపీకి వ్యతిరేకంగా పలు కేసులు పెడుతూ నిత్యం వార్తల్లో నిలిచి తన ఇమేజ్‌ని కూడా పెంచుకున్నారు.

పార్టీకి, జగన్‌కు ఆళ్ల తొలి నుంచి వీరవిధేయుడుగా వ్యవహరిస్తూ వచ్చారు. ఓదార్పు యాత్రల సమయంలో ఎంతో వ్యయం చేసుకొని రాష్ట్రమంతటా పార్టీ అధినేత జగన్‌కు నీడలా ఉన్నారు. అంతేకాదు, ఏ మాత్రం రాజీ పడకుండా అధికార పార్టీపై ఎన్నో పోరాటాలు చేశారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఆళ్లకు, నారా లోకేష్‌కు మధ్య పోటీ జరగనుంది. ఈ క్రమంలో నియోజకవర్గంలో ఒక ముఖ్య నేత పార్టీని వీడడం టీడీపీకి నారా లోకేష్‌కు షాక్ ఇవ్వడమే. 

మంగళగిరి నియోజకవర్గంలో దాదాపు ఓటర్ల సంఖ్య 2 లక్షల 40 వేలు. ఆధిక్యంలో మొదట ఎస్సీ ఓటర్లు ఉండగా తర్వాత స్థానాల్లో పద్మశాలి, యాదవ, గౌడ్, కాపు, కమ్మ కులస్థులు ఉన్నారు. ఇక్కడ గెలుపోటములపై ప్రభావం చూపేది సాధాణంగా బీసీ వర్గం. కాండ్రు కమల బీసీ వర్గానికి చెందిన పద్మశాలి కావడం వల్ల ఆమె హవా ఉంటుంది.

రాష్ట్రంలోనే అత్యధికంగా పద్మశాలీలు మంగళగిరి నియోజకవర్గంలోనే ఉన్నారు. వీరి కుటుంబానికి నియోజకవర్గంలో పట్టు కూడా ఉంది. కీండ్రు కమల ఒకసారి, ఆమె వియ్యంకుడు మురుగుడు హనుమంతురావు రెండుసార్లు ఇదే నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచారు. అయితే ఇప్పుడు వారి కుటుంబానికి టిక్కెట్ రాకపోవడంతో కాండ్రు కమల తెలుగుదేశంకు గుడ్‌బై చెప్పేసింది. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఆందోళనలో ఉన్నారు. కాండ్రు కమల టీడీపీకి గుడ్‌బై చెప్పడంతో నియోజకవర్డం రాజకీయంలో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది. 
Read Also : మీకు మీరే సాటి : పాల్ చేష్ట‌లు – వ‌ర్మ సెటైర్లు