ఎక్కడ పుట్టాడో అక్కడికే : టీఆర్ఎస్ లోకి జగ్గారెడ్డి

  • Published By: madhu ,Published On : March 16, 2019 / 07:44 AM IST
ఎక్కడ పుట్టాడో అక్కడికే : టీఆర్ఎస్ లోకి జగ్గారెడ్డి

Updated On : March 16, 2019 / 7:44 AM IST

తెలంగాణ కాంగ్రెస్ ఖాళీ అవుతుంది. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నారు. మిగతా వాళ్ల సంగతి ఏమోగానీ.. సబితా ఇంద్రారెడ్డి ఇచ్చిన షాక్ నుంచి ఇంకా నేతలు కోలుకోలేదు. సరిగ్గా ఇదే సమయంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా పార్టీ మారుతున్నట్లు వార్తలు వచ్చేశాయి. ఇదే జరిగితే… తెలంగాణలో కాంగ్రెస్ ఖతం అయినట్లే అంటున్నారు రాజకీయ నిపుణులు. 

మెదక్ జిల్లా సంగారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైన తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి) ముఖ్య అనుచరులతో భేటీ అయ్యారు. మార్చి 16వ తేదీ శనివారం రహస్య చర్చలు జరుపుతున్నారు. ఓ వైపు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల ఎన్నికపై సీరియస్ గా డిస్కషన్స్ చేస్తుంటే.. జగ్గారెడ్డి అందుబాటులో లేకుండా పోవటంతో చర్చనీయాంశం అయ్యింది. కాంగ్రెస్ నేతలు ఫోన్ చేసినా స్పందించటం లేదంట. ముఖ్యనేతలు, అనుచరులతో భేటీ అయిన జగ్గారెడ్డి.. పార్టీ మారితే ఎలా ఉంటుంది.. టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లటంపై వారి అభిప్రాయాలు తీసుకుంటున్నారు.
Read Also : కోమటిరెడ్డికి కాంగ్రెస్ హ్యండ్.. కారణం ఇదేనా?

కొన్నాళ్లుగా జగ్గారెెడ్డి మాటలో తేడా కనిపిస్తోంది. టీఆర్ఎస్ పార్టీ అంటేనే అంతెత్తున లేచే ఆయన.. ఈ మద్య పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని, కేసీఆర్‌ ను ఆకాశానికెత్తుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రేమ కురిపించటం, ప్రస్తుతం అజ్ణాతంలోకి వెళ్లటం చూస్తుంటే.. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పటం ఖాయంగా కనిపిస్తోంది. పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారాన్ని జగ్గారెడ్డి ఖండించకపోవటం చూస్తుంటే.. మరికొన్ని రోజుల్లోనే మార్పు తధ్యం అంటున్నారు.

పడిపోతున్న కాంగ్రెస్ బలం : 
కాంగ్రెస్ నుంచి ఇప్పటికే రేగా కాంతారావు (పినపాక), ఆత్రం సక్కు (ఆసిఫాబాద్), చిరుమర్తి లింగయ్య (నకిరేకల్), హరిప్రియ (ఇల్లెందు), సబితారెడ్డి (మహేశ్వరం), ఉపేందర్ రెడ్డి (పాలేరు)లు గులాబీ గూటికి చేరుతున్నారు. మరో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి జంప్ తో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య ఏడుకి పడిపోనుంది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సైతం కేటీఆర్‌తో భేటీ అయ్యారని ప్రచారం జరిగింది. దీనిని ఆయన ఖండించారు.

ఇదే జరిగితే : 
వలసలు ఇదే విధంగా కొనసాగితే.. కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం హోదాను కోల్పోనుంది. 19మందిలో మొత్తం 13మంది సభ్యులు టీఆర్ఎస్‌లో చేరితే.. కాంగ్రెస్‌కు కష్టాలు తప్పవు. మెజారిటీ ఎమ్మెల్యేలు తమదే అసలు సీఎల్పీ అని ప్రకటించే ప్రమాదం లేకపోలేదు. అదే జరిగితే.. భట్టి స్థానంలో కొత్త సీఎల్పీని తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఎన్నుకునే అవకాశం ఉంది.