శ్రీశైలం నాలుగు గేట్లు ఎత్తివేత

  • Published By: veegamteam ,Published On : September 9, 2019 / 10:46 AM IST
శ్రీశైలం నాలుగు గేట్లు ఎత్తివేత

Updated On : September 9, 2019 / 10:46 AM IST

కృష్ణా నదికి భారీ ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు గంట గంటకు వరద‌ ఉదృతి పెరుగుతోంది. ప్రాజెక్టులోకి 3 లక్షల 29 వేల 218 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. 2 లక్షల 961  క్యూసెక్కుల నీటిని 4 గేట్లను 10 అడుగులు ఎత్తి దిగువ నాగార్జునసాగర్ కు విడుదల చేస్తున్నారు. 

ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నది, దాని ఉపనదులకు వరద పోటెత్తుతోంది. ఇప్పటికే ఆల్మట్టి, జూరాల జలాశయాలు నిండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215. టీఎంసీలు కాగా, ప్రస్తుతం 212 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా.. ప్రస్తుతం 884.40 అడుగులకు చేరింది. 

శ్రీశైలం కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. డ్యాంకు దిగువ బాగంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.