సమ్మర్ ఎఫెక్ట్ : గ్రామాల్లో ఏనుగుల సంచారం

శ్రీకాకుళం : తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపానికి జనాలే అల్లాడి పోతుంటే, అడవుల్లో ఉండే మూగ ప్రాణులు మాత్రం తట్టుకోగలుగుతాయా ?….ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఎండ వేడిమి తట్టుకోలేని గజరాజులు శ్రీకాకుళం జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లోకి వస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. గడచిన కొన్నినెలలుగా పాతపట్నం, మెళియాపుట్టి మండలాల్లోని కొండప్రాంతాల్లో ఇవి సంచరిస్తున్నాయి. రట్టిని, వసుందర, కోసమాల, మెళియాపుట్టి పోలీసు స్టేషన్ ఎదురుగా కొండ ప్రాంతాల్లో 6 ఏనుగులు తిరుగుతున్నాయి.
శుక్రవారం అర్ధరాత్రి పాతపట్నం లోని… కమలమ్మ కొట్టు జంక్షన్ నుంచి వంతెన సెంటర్ వరకు తిరుగుతూ ఏనుగులు హల్ చల్ చేస్తున్నాయి. ఎండ తీవ్రత ఎక్కువ అవ్వడంతో కొండలు దిగి జనావాసాలకు దగ్గరగా గజరాజులు వచ్చేస్తుండడటంతో ఏనుగులు ఎక్కడ దాడిచేస్తేయో అని స్థానికులు భయంతో వణికి పోతున్నారు. అటవీ శాఖ అధికారులు అప్రమత్తత చేస్తున్నప్పటికీ ఎప్పుడు గ్రామాలపై గజరాజులు దాడి చేస్తాయో అని భయబ్రాంతులకు గురవుతున్నారు. పంటలు, తోటలు సైతం ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయి. ఏనుగులు గుంపుని ఆటవీ ప్రాంతాలకు తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు.