ప్రియాంక ఇంటి దగ్గర ఉద్రిక్తత : పోలీసులను నెట్టేసి గేటుకి తాళం

  • Published By: veegamteam ,Published On : December 1, 2019 / 05:47 AM IST
ప్రియాంక ఇంటి దగ్గర ఉద్రిక్తత : పోలీసులను నెట్టేసి గేటుకి తాళం

Updated On : December 1, 2019 / 5:47 AM IST

శంషాబాద్ లోని వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రియాంక తల్లిదండ్రులు నివాసముంటున్న నక్షత్ర విల్లా దగ్గర గస్తీ కాస్తున్న పోలీసులను స్థానికులు బయటికి నెట్టేశారు. విల్లాలోకి ఎవరూ రావొద్దంటూ లోపలి నుంచి మెయిన్ గేట్ కు తాళం వేశారు. పోలీసులు, నాయకులు, మీడియా రావొద్దంటూ బోర్డులు పెట్టారు. గేట్ లోపల బైఠాయించిన కాలనీవాసులు.. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే స్థానికులను లోపలికి రానిస్తున్నారు.

ఈ ఘటనపై సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి న్యాయం చేయాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. పరామర్శలు, సానుభూతి వద్దు.. న్యాయం కావాలి అంటూ నినాదాలు చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన కాలనీవాసులు వారిని బయటికి పంపేశారు. స్థానికుల నుంచి నిరసన వ్యక్తం కావడంతో పోలీసులు నక్షత్ర విల్లా నుంచి వెనుదిరిగారు. భద్రతా చర్యల్లో భాగంగా ప్రియాంక రెడ్డి కుటుంబం నివాసముంటున్న నక్షత్రా విల్లా ఎంట్రన్స్, ఎగ్జిట్ గేట్ దగ్గర పోలీసులు బందోబస్తుగా ఉన్నారు.  

ప్రియాంక రెడ్డి తల్లిదండ్రులు రాజకీయ నాయకులు, పోలీసులు, మీడియాకు కీలక విన్నపం చేశారు. దయచేసి మా ఇంటికి రావొద్దని వారు కోరారు. తమ ఆవేదనను అర్థం చేసుకోవాలని వేడుకున్నారు. ఎవరొచ్చినా ఇప్పుడు చేసేదేమీ లేదన్నారు. ఎవరి సానుభూతి తమకు అక్కర్లేదన్నారు. ఎవరొచ్చినా తమ కూతురిని తిరిగి తీసుకురాలేరు కదా అని అంటున్నారు.