విశాఖ రాజధాని ! అన్ని కమిటీల మాటే ఇది

  • Published By: vamsi ,Published On : January 4, 2020 / 08:23 AM IST
విశాఖ రాజధాని ! అన్ని కమిటీల మాటే ఇది

Updated On : January 4, 2020 / 8:23 AM IST

అమరావతి వద్దు, విశాఖే ముద్దు.. ఏపీలో ముఖ్యమంత్రి జగన్ నియమించిన ఏ రిపోర్టు అయినా చెప్పొచ్చేది ఇదే. అసెంబ్లీలో ముందుగా ప్రకటించినట్లుగానే ఇప్పటికి రెండు కమిటీలు ఇచ్చిన రిపోర్ట్ ఏంంటంటే.. రాష్ట్రంలో మూడు రాజధానులు. జగన్ కోరుకున్నది.. కోరుకునేది అదే. అందుకే జీఎన్ రావు కమిటీ అయినా.. బోస్టన్ కమిటీ అయినా అదే చెబుతుంది. బోస్టన్ కన్సల్టెన్సీ సర్వీస్.. ఓ రిపోర్ట్ ఇచ్చి, అందులో అనేక అంశాలను చేర్చింది. 

అసలు కన్సల్టెన్సీ సంస్థలు అంటేనే కస్టమర్ చెప్పిన విధంలోనే వారి నిర్ణయాలను వెల్లడిస్తాయి. ఈ క్రమంలోనే బోస్టన్ కమిటీ కూడా ఇచ్చేసింది. అంటే విశాఖకు రాజధాని వెళ్లడం ఖాయం.. అయితే ఊరికే తీసుకుని వెళ్తే ఒప్పుకుంటారా? అందుకే  బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు ఓ రిపోర్ట్ ఇస్తు.. అలాగే జీఎన్‌రావు కమిటీ  ఒక రిపోర్ట్ ఇస్తే ఇంకేదో కమిటీ మరొక రిపోర్ట్ ఇస్తే అందరూ ఒకటే చెప్పారు. ఇప్పుడు మార్చుకుందాం అంటూ కేబినేట్‌లో ఆ లెక్కలు చూపించొచ్చు.

అలాగే, మంత్రి వర్గంలో వాటిని ఆమోదించవచ్చు. మరో పది రోజుల్లోనో పండుగ తర్వాతో, పండుగకు ముందో మంత్రులు, ఉన్నతాధికారుల హైపవర్ కమిటీ కూడా ఇదే చెప్పబోతుంది. అందులో వీసమెత్తు అనుమానం అక్కర్లేదు. అంటే రాజధాని మార్పు అనే నిర్ణయం జరిగిపోయింది. చట్టప్రకారం దానికి ఒక స్పష్టమైన క్లారిటీ కావాలి. వాటి కోసమే ఈ కసరత్తులు. ఇది నా ఒక్కడి నిర్ణయం కాదు.. గుడ్డిగా తీసుకున్న నిర్ణయం కానే కాదు అని చెప్పే ప్రయత్నమే ఇది. ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

బోస్టన్ కమిటీ చెబుతున్న సూత్రం ‘గ్రీన్ ఫీల్డ్ సిటీ వేస్టు’. బోస్టన్ కమిటీ నివేదిక ప్రకారం.. చైనాలోని షెన్‌జెన్, ఇండియాలోని నవీ ముంబయి తప్ప ఇంకా ఏ గ్రీన్ ఫీల్డ్ సిటీ సక్సెస్ కాలేదు అని చెప్పింది. ప్రపంచంలోని మరికొన్ని కొత్త రాజధానుల సంగతీ ఉదాహరణలుగా ప్రస్తావిస్తూ.. అమరావతి రాజధాని కట్టాలంటే లక్ష కోట్లు కావాలని చెప్పింది. ఇంకా అప్పులు కావాలి, ఆ వడ్డీలకే మన ఆదాయం సరిపోదు స్పష్టం చేసింది.

అమరావతి లాభదాయకం కాదు.. అసలు అంత జనాభా అక్కడికి రారు సాంకేతిక అంశాలతో వెల్లడించింది. ఇప్పటికే రెండున్నర లక్షల కోట్ల అప్పు ఉన్న రాష్టానికి రాజధాని కట్టడం కోసం మరో లక్ష కోట్లు కావాలంటే కష్టం అనేది వైసీపీ ప్రభుత్వం వాదన.. దానికి టీడీపీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ అని మరో విధానం చెబుతుంది.

ఆ విషయాన్ని పక్కన పెడితే.. రాజధాని మార్పు అనేది ఓ రాజకీయ నిర్ణయం.. అది జరిగి తీరుతుంది అనేది ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. మరికొద్ది రోజుల్లో రాజధాని మారటం అనేది లాంఛనమే. ఇక కేంద్రానికి ఉన్న ప్రత్యేక అధికారాలతో కేంద్రం కలగజేసుకుని జగన్‌కు ఈ నిర్ణయం తీసుకునే అధికారం లేదు అని అంటే.. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేసుకుంటుంది జగన్ ప్రభుత్వం. అందులో ఏ మాత్రం సందేహం లేదు.