ముగిసిన తిరుమల బ్రహ్మోత్సవాలు : 8 రోజుల్లో 20.40 కోట్ల ఆదాయం

కలియుగ వైకుంఠదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా ముగిశాయి. చివరి అంకమైన చక్రస్నాన, ధ్వజావరోహణ ఘట్టాన్ని వేదపండితులు మంత్రోచ్ఛారణ మధ్య కన్నులపండువగా నిర్వహించారు. తొమ్మిది రోజులుగా వివిధ వాహనాలపై విహరించిన స్వామివారు సేదతీరేందుకు చివరి రోజున చక్రస్నానం నిర్వహించడం ఆనవాయితీ. వరహాస్వామి ఆలయం వద్ద స్వామివారి చక్రత్తాళ్వార్‌కు స్నపన తిరుమంజనాదులు పూర్తిచేసి వేదపండితులు చక్రస్నాన క్రతువును జరిపించారు. స్వామి ప్రతినిధిగా చక్రత్తాళ్వారుకి… వరాహ పుష్కరిణిలో స్నానం చేయించారు. అనంతరం స్వామివారిని ఆనంద నిలయానికి తరలించారు.
రాత్రి శ్రీవారి ఆలయంలో ధ్వజావరోహణం నిర్వహించారు. శ్రీవారి ఆలయ ధ్వజస్తంభం మీద అరోహణం చేసిన గరుడ పతాకాన్ని అవరోహణ చేయడంతో వార్షిక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. తిరుమలలో బ్రహ్మోత్సవాలు విజయవంతమయ్యాయని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ప్రకటించారు. ఈ ఏడాది 8 రోజుల్లో 7.7 లక్షల మంది శ్రీవారి దర్శనం చేసుకున్నారని వెల్లడించారు. హుండీ ద్వారా 20.40 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. 3.23 లక్షల మంది తలనీలాలు సమర్పించారని తెలిపారు.
బ్రహ్మోత్సవాల్లో భక్తులకు మెరుగైన సేవలందించిన టీటీడీ, వివిధ శాఖల సిబ్బందిని ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ అభినందించారు. రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ… భక్తులు సమయనం పాటించి స్వామివారి దర్శనం చేసుకున్నారన్నారు. ఈ ఏడాది భక్తులకు 34 లక్షల లడ్డూలు అందించామన్నారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల్లో 18 రాష్ట్రాల నుండి 357 కళా బృందాలు పాల్గొన్నాయన్న ఈవో సింఘాల్… వచ్చే ఏడాది 25 రాష్ట్రాల నుంచి ఉన్నతస్థాయి కళాకారుల్ని రప్పిస్తామని తెలిపారు.
Read More : దేవరగట్టు బన్నీ ఉత్సవం : కర్రలతో కొట్టుకున్న జనాలు