చంద్రబాబు కోసం వంగవీటి రాధ పూజలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిన వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా చంద్రబాబు కోసం యాగం చేయిస్తున్నారు. మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలంటూ మూడురోజుల పాటు రాధ శ్రీయాగం నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు. తన చెల్లెలు, బావతో కలిసి ఈ యాగం నిర్వహిస్తున్నారు వంగవీటి.
మూడురోజులపాటు వేద మంత్రోచ్ఛారణల నడుమ సాగే యాగం.. ఏప్రిల్ 3న ఉదయం పూర్ణాహుతితో ముగుస్తుంది. రాష్ట్రంలో కుల, మతాల మధ్య ఎటువంటి గొడవలు లేకుండా శాంతియుతంగా ఉండాలంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో అగ్రపథాన నిలవాలంటే ముఖ్యమంత్రిగా మళ్లీ చంద్రబాబే అధికారంలోకి రావాలని వంగవీటి రాధ అభిప్రాయపడ్డారు.
విజయవాడలోని కేజే గుప్తా కల్యాణమంటపంలో ఈ యాగం నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం వంగవీటి రాధ సోదరి ఆశా, ఆమె భర్త కలిసి పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. గోపూజ, వాస్తు హోమం నిర్వహించి శ్రీయాగాన్ని మొదలపెట్టారు. రుత్వికుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీయాగంకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.
మాజీ ఎమ్మెల్యే రాధ అమ్మ వంగవీటి రత్నకుమారి కూగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజశ్యామల యాగం నిర్వహించగా ఆయన అధికారంలోకి రావడానికి ఆ యాగమే కారణమని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.