అప్పుడు కలరా.. ఇప్పుడు కరోనా: 42ఏళ్ల తర్వాత ఆలయం మూసివేత

దీప, దూప నైవేద్యాలతో నిత్యం శోభాయమానంగా విరాజిల్లిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయం వెలవెలబోతుంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా ఆలయాలకు భక్తుల సందర్శనను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేయగా, రాజన్న ఆలయంలో భక్తుల సందర్శనను ఆపివేశారు. ఆలయ చరిత్రలో వందేళ్ల క్రితం ప్లేగు వ్యాధి కారణంగా మూడు నెలలు ఆలయానికి భక్తుల రాకను నిలిపివేయగా, 1978లో వచ్చిన కలరా వ్యాధితో నెల పాటు స్వామివారి దర్శనం ఆపేశారు.
అయితే ఇన్నేళ్ల తర్వా 42ఏళ్ల తర్వాత కరోనా కారణంగా మరోసారి ఆలయాన్ని మూసివేశారు. అయితే స్వామివారి నిత్యసేవలను యథావిధిగా కొనసాగించినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. స్వామివారి సన్నిధికి రోజూ దాదాపు 5 వేల మంది భక్తులు వస్తుంటారు. కరోనా ప్రభావంతో మూసివేయగా ఆలయ పరిసరాలు నిర్మానుష్యంగా మారిపోయాయి.
మార్చి 31వ తేదీ వరకు భక్తులకు ఎలాంటి దర్శనాలు ఉండబోవని ఈవో కృష్ణవేణి ప్రకటించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించి ప్రయాణాలు రద్దు చేసుకోవాలని కోరారు. ఆలయం తెరచిన తర్వాతనే దర్శనాలకు రావాలని విజ్ఞప్తి చేశారు. మళ్లీ ఎప్పుడు తెరిచేది త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.