విశాఖలో టీడీపీకి భారీ షాక్ : వైసీపీలోకి ఆడారి ఆనంద్, తండ్రి మాత్రం టీడీపీలోనే

  • Published By: madhu ,Published On : September 1, 2019 / 05:30 AM IST
విశాఖలో టీడీపీకి భారీ షాక్ : వైసీపీలోకి ఆడారి ఆనంద్, తండ్రి మాత్రం టీడీపీలోనే

Updated On : September 1, 2019 / 5:30 AM IST

విశాఖపట్టణంలో టీడీపీకి మరో భారీ షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు అడారి ఆనంద్ కుమార్, రమా కుమారిలు వైసీపీలోకి జంప్ కానున్నారు. సెప్టెంబర్ 01వ తేదీ ఆదివారం సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆనంద్ ఇప్పుడు పార్టీ మారేందుకు సిద్ధం అయ్యారు. ఎలమంచిలి మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా రమాకుమారి ఉన్నారు. 

విశాఖ డెయిరీ ఛైర్మన్‌గా ఆడారి తులసీరావు కుమారుడే ఆనంద్ కుమార్. కుమార్తె రమా కుమారి. ఉత్తరాంధ్ర జిల్లాల రైతుల్లో విశాఖ డెయిరీ పాలకవర్గానికి మంచి పట్టుంది. ఈ డెయిరీపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ మారాలని ఆడారి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సోదరుడు బాటలోనే వెళ్లాలని రమా కుమారి నిర్ణయం తీసుకున్నారు. దీని వెనుక ఓ వ్యక్తి కీలక పాత్ర పోషించారని ప్రచారం జరుగుతోంది. పార్టీ మారుతారనే ప్రచారం జరగడంతో గతంలో ఆడారిని టీడీపీ నేతలు బుజ్జగించినట్లు తెలుస్తోంది.

ఆనంద్‌తో పాటు విశాఖ డెయిరీ డైరెక్టర్స్ వైసీపీ కండువాలు కప్పుకొనేందుకు రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో డెయిరీ వైసీపీ గుప్పిట్లోకి వెళ్లనుంది. 2019 ఎన్నికల్లో అనకాపల్లి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఆనంద్ పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థిగా డా. బి. వెంకట సత్యవతి పోటీ చేశారు. ఆనంద్‌పై సత్యవతి గెలిచారు. ఆడారి ఆనంద్‌కు 2, 74, 793 ఓట్లు రాగా.. వైసీపీ అభ్యర్థిని సత్యవతికి 3,32,970 ఓట్లు దక్కాయి.

ఇదిలా ఉంటే ఆడారి ఆనంద్ తండ్రి విశాఖ డెయిరీ చైర్మన్‌ ఆడారి తులసీరావు మాత్రం పార్టీ మారేది లేదని స్పష్టం చేశారు. తెలుగుదేశం నాయకులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, పప్పల చలపతిరావు, పీలా గోవింద భేటీ అయిన ఆయన, తాను మాత్రం పార్టీలో సాగుతున్నానని, తన కుమారుడు మాత్రం పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నారు అని చెప్పారు. ఆనంద్‌కు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందని వెల్లడించారు.