కరోనాపై యుద్ధం, ప్రైవేట్ ఆస్పత్రులూ ప్రభుత్వ పరిధిలోకి, సీఎం జగన్ నిర్ణయంతో జరిగే లాభం ఏంటి

కరోనాపై ఏపీ ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. వేగంగా విస్తరిస్తున్న కరోనా కట్టడికి జగన్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. లాక్ డౌన్ విధించింది. ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేసింది. వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసింది. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి క్వారంటైన్ లో ఉంచుతున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా కట్టడి చేస్తున్నారు. పేదలు, వలస కూలీలకు ఇబ్బందులకు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే.. ప్రైవేట్ ఆసుపత్రులూ ప్రభుత్వం పరిధిలోకి తీసుకోవడం.
కరోనాను ఎదుర్కోవాలంటే ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు కలిసి పని చేయాలి:
ప్రైవేట్ ఆసుపత్రులను ప్రభుత్వం పరిధిలోకి తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? దాని వాల్ల లాభం ఏంటి? కరోనాపై గెలవడానికి సీఎం జగన్ తీసుకున్న డెసిషన్ ఉపయోగపడుతుందా? ఇలా అనేక అనుమానాలు. దీనిపై స్పందించిన సీనియర్ డాక్టర్లు, వైద్య రంగానికి చెందిన నిపుణులు.. ఇది కరెక్ట్ డెసిషన్ అంటున్నారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని వారు సమర్థిస్తున్నారు. రైట్ టైమ్ లో రైట్ డెసిషిన్ తీసుకున్నారని ప్రశంసిస్తున్నారు. కరోనా వైరస్ మహమ్మారి చాలా డేంజర్ అని, చాలా పెద్ద సమస్య కానుందని డాక్టర్లు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, డాక్టర్లు, నర్సులు అంతరూ కలిసి పని చేస్తేనే కరోనాను కట్టడి చేయడం సాధ్యమవుతుందని స్పష్టం చేస్తున్నారు. కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా బాధితులకు ట్రీట్ మెంట్ చేస్తాము, ప్రభుత్వమే ఈ సమస్యను ఎదుర్కోగలదు అని అనడం కరెక్ట్ కాదంటున్నారు. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకుని ప్రైవేట్ ఆసుపత్రులను కూడా కలుపుకుని పోవాలని సూచిస్తున్నారు. కరోనా బాధితులందరికీ మెరుగైన వైద్యం అందించాలంటే ఇదొక్కటే మార్గం అంటున్నారు.
అందరూ కలిపి పోరాటం చేస్తేనే కరోనాపై విజయం-డాక్టర్ సోమరాజు:
కరోనాపై ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు ఎందుకు కలిసి పని చేయాలి అనే దానిపై సీనియర్ కార్డియాలజిస్ట్, డాక్టర్ సోమరాజు స్పందించారు. దాని ఆవశ్యకత ఏంటో విడమరిచి చెప్పారు. ఆయన ఏమన్నారంటే..” ఇది చాలా సీరియస్. గవర్నమెంట్ ఆసుపత్రుల్లోనే ట్రీట్ చేస్తాము, ప్రైవేట్ హాస్పిటల్స్ లో చేయము అని చెప్పడం తప్పు. గవర్నమెంటు కానీ, ప్రైవేట్ కానీ, సింగిల్ గా చేయలేరు. అందరూ కలవాలి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు కలవాలి. ఈ సమస్యను ఎవరో ఒకరి మీద మాత్రమే వదలిలేయలేము. ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ కావాల్సిందే. గవర్నమెంట్, పబ్లిక్, ప్రైవేట్ సంస్థలు కలిసి రావాలి. పని చేయాలి. అప్పుడే ఏదైనా ఫలితం ఉంటుంది. కరోనా వైరస్ చాలా తీవ్రంగా దాడి చేయబోతోంది. గొప్పలకు పోకూడదు. గవర్నమెంట్ మాత్రమే కరోనాను హ్యాండిల్ చేస్తుందని కొందరు రాజకీయ నాయకులు స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. అది తప్పు. అందరూ కలిసి పోరాటం చేస్తే మంచిది” అని డాక్టర్ సోమరాజు అన్నారు.
కరోనా బాధితులందరికీ మెరుగైన వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం:
కరోనాపై యుద్ధం చేస్తున్న సీఎం జగన్, రాష్ట్రంలో ప్రైవేట్ ఆస్పత్రులు సైతం కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రైవేట్ పరిధిలోని వైద్య కళాశాలలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, నర్సింగ్ హోంలను కూడా ప్రభుత్వ పరిధిలోకి తెస్తూ ఆదేశాలు జారీ చేశారు. జాతీయ విపత్తుల నివారణ చట్టం 2005 (సెక్షన్ 10(2)1తో పాటు అంటువ్యాధుల నివారణ చట్టం 1897 ప్రకారం అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, ప్రభుత్వేతర ఆస్పత్రులు, ట్రస్ట్‌ల పేరుతో నిర్వహిస్తున్న ఆస్పత్రులు ఇకపై సర్కారు పరిధిలో పనిచేయాలని పేర్కొన్నారు. తొలిదశలో 450 ఆస్పత్రులను ప్రభుత్వ పరిధిలోకి తేవాలని నిర్ణయించారు. పరిస్థితులను బట్టి ఈ సంఖ్య పెంచుతారు. దేశవ్యాప్తంగా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ విధించిన నేపథ్యంలో ఎపిడెమిక్ డిసీజ్ (కోవిడ్) రెగ్యులేషన్ 2020 ప్రకారం చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి పేర్కొన్నారు.
ఉత్తర్వుల్లో ముఖ్యాంశాలు:
* ప్రైవేట్/ నాన్‌గవర్నమెంట్ మెడికల్, హెల్త్ ఇన్‌స్టిట్యూషన్స్, అందులో పనిచేసే సిబ్బంది, వసతులు, ఐసొలేషన్ పడకలు, రూములు, ఐసీయూ వార్డులు, వెంటిలేటర్లు, టెస్టింగ్ ల్యాబొరేటరీలు, ఫార్మసీలు, శవాగారాలు, ఎక్విప్‌మెంట్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీములు ప్రభుత్వ పరిధిలో కరోనా బాధితులకు సేవలు అందించాలి.
* ఎలాంటి వసతుల వినియోగానిౖకైనా ప్రభుత్వ పరిధిలోకి వచ్చే వారికే ప్రాధాన్యం ఉండాలి
* ప్రభుత్వేతర, ప్రైవేటు సంస్థలు నిర్వహించే ఏ పనులైనా ప్రభుత్వానికి ఉపయోగపడేవి అయి ఉండాలి. జిల్లా స్థాయి సంస్థలు స్థానిక అధికారుల ఆదేశాలపై స్పందించాలి
* స్పెషలిస్టు డాక్టర్లు, నర్సులు, ఇతర మెడికల్, నాన్‌మెడికల్ సిబ్బందిని ప్రభుత్వం ఎక్కడైనా నియమించవచ్చు.
విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టామని, కరోనా బాధితులందరికీ మెరుగైన వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, చికిత్స అందించేందుకు ప్రైవేట్ ఆస్పత్రులను కూడా తీసుకోవాలని నిర్ణయించామని వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి చెప్పారు.
కాంగ్రెస్ పాలిత మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆధీనంలోకి ప్రైవేట్ ఆసుపత్రులు:
కరోనా వైరస్ మహమ్మారి బెడదతో వణికిపోతున్న దేశాన్ని మరో దశకు చేరుకోకముందే కాపాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు రాత్రింబవళ్లు కష్ట పడుతున్నాయి. వనరులన్నింటినీ సేకరించి అవసరాలు తీర్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. పబ్లిక్ హెల్త్ సెక్టార్ లో సరైన వసతులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారనే మాట వాస్తవం. ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్, బెడ్స్, వెంటిలేటర్లు వంటి సౌకర్యాలున్న ప్రైవేట్ హాస్పిటల్స్‌తో పోలిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పని చేసే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో చాలా తక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రులను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవడం సరైన నిర్ణయమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇప్పటికే కాంగ్రెస్ పాలిత చత్తీస్‌ఘడ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రైవేట్ హాస్పిటల్స్‌ను తాత్కాలికంగా తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించాయి. కొవిడ్-19 పేషెంట్ల ట్రీట్‌మెంట్‌లో భాగంగా ఈ తాత్కాలిక నిర్ణయం తీసుకున్నాయి. ఏదైనా ప్రమాదకరమైన జబ్బు ప్రబలిన సమయంలో ఎదుర్కొనేందుకు సమష్టిగా పోరాడాలనేది ఆ ప్రభుత్వాల ఉద్దేశ్యం. ఇప్పుడు సీఎం జగన్ సైతం అదే బాటలో వెళ్లడం సానుకూల అంశం అంటున్నారు వైద్య నిపుణులు.
Also Read | యూపీలో బ్లీచ్ స్ప్రే, కేరళలో సోప్ వాటర్..ఏదైనా..వలస కూలీలే.. అమానుషం