YSRCP అభ్యర్థుల లిస్టు : ఒకే ఫ్యామిలీలో 2 టికెట్లు 

  • Published By: madhu ,Published On : March 17, 2019 / 06:44 AM IST
YSRCP అభ్యర్థుల లిస్టు : ఒకే ఫ్యామిలీలో 2 టికెట్లు 

వైసీపీ పార్టీలో ఉన్న నేతల కుటుంబాల్లో ఇద్దరికి టీకెట్ కేటాయించారు జగన్. 2019 అసెంబ్లీ ఎన్నికల బరిలో తనయులు, సోదరులు అదృష్టం పరీక్షించుకోనున్నారు. మార్చి 17వ తేదీ ఆదివారం వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 175 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించేంది. అందులో ధర్మాన, బోత్స, మేకపాటి, కాటసాని కుటుంబాలకు టికెట్‌లు వచ్చాయి. ఒకసారి ఏ కుటుంబంలో ఎవరికి టికెట్ వచ్చిందో చూద్దాం.

విజయనగరం..బోత్స సత్యనారాయణ : 
బోత్స సత్యనారాయణ ఇంట్లో 2 అసెంబ్లీ టికెట్లు వచ్చాయి. ఆయన సోదరుడు బోత్స అప్పల నరసయ్యకు వైసీపీ టికెట్ కేటాయించింది. గజపతినగరం నుండి ఆయన బరిలో ఉంటారని ప్రకటించింది. ఇక చీపురుపల్లి నుండి మరోసారి బోత్స సత్యనారాయణ బరిలో నిలిచారు. 

విజయనగరం జిల్లా రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ తిరుగులేని నేత. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సీఎం అభ్యర్థిగా కూడా ప్రచారంలో ఉండేవారు. పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. వైఎస్ దగ్గర ఆయనకున్న పలుకుబడి ఉపయోగించుకుని తన కుటుంబానికి 4 సీట్లు తెప్పించుకోగలిగారాయన. ఆ ఎన్నికల్లో జిల్లాలో చీపురుపల్లి నుంచి బొత్స గెలిస్తే, ఆయన సోదరుడు బొత్స అప్పలనర్సయ్య, మేనల్లుడు బడ్డుకొండ అప్పలనాయుడు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇక బొత్స సతీమణి ఝాన్సీ ఎంపీగా గెలుపొందారు. 2009 డీలిమిటేషన్ తర్వాత విజయనగరం జిల్లాలో అసెంబ్లీ సీట్ల సంఖ్య 12 నుంచి 9కి పడిపోయింది. వీటిలో 3 అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ స్థానం కూడా బొత్స కుటుంబం దక్కించుకోవడంతో అప్పట్లోనే పార్టీలో అసంతృప్తి చెలరేగింది. బొత్సను విజయనగరం నుంచి ఎంపీగా రంగంలోకి దించుతారని ప్రచారం జరిగింది. కానీ తాజాగా ప్రకటించిన లిస్టులో చీపురుపల్లి అసెంబ్లీ స్థానం నుండి బోత్స..గజపతి నగరం నియోజకవర్గం నుండి బోత్స అప్పల నర్సయ్య బరిలో నిలుస్తున్నారు. 

శ్రీకాకుళం : ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంపై అందరి దృష్టి ఆ బ్రదర్స్‌పైనే ఉంది. వారే ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్. వీరిద్దరూ వైసీపీ పార్టీ తరపున 2019 ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. మార్చి 17వ తేదీ ఆదివారం వైసీపీ 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. అందులో వారిద్దరి పేర్లున్నాయి. శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు, నరసన్నపేట నుంచి ధర్మాన కృష్ణదాస్ పోటీలో ఉన్నారు. 

శ్రీకాకుళం జిల్లా నేతగానే కాకుండా రాష్ట్ర స్థాయి నేతగా ధర్మానకు గుర్తింపు ఉంది. కొన్ని ఆరోపణలు రావడంతో ఆయన గ్రాఫ్ పడిపోయింది. గత ఎన్నికల్లో ఆయన 24 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశ్యంతో నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 2004, 2009 సాధారణ ఎన్నికల్లోనూ, 2012 ఉప ఎన్నికల్లోనూ గెలిచిన ధర్మాన కృష్ణ దాస్ 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య బేదాభిప్రాయాలున్నాయని, విబేధాల కారణంగా విడిపోవడం కారణాలుగా చెప్పవచ్చు. గత ఎన్నికల్లో 5800 ఓట్ల తేడాతో కృష్ణ దాస్ ఓటమి పాలయ్యారు. బ్రదర్స్ ఏకమవ్వడంతో వైసీపీ ఈజీగా గెలుస్తుందని పార్టీ నేతలు అనుకుంటున్నారు. మరి ఏం జరుగుతుంది ? చూడాలి. 

నెల్లూరు : మేకపాటి
నెల్లూరు విషయానికోస్తే సీనియర్ నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఫ్యామిలీలో ఇద్దరికి టికెట్ ఇచ్చారు జగన్. ఉదయగిరి నియోజకవర్గం నుండి మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఆత్మకూరు నియోజకవర్గం నుండి మేకపాటి గౌతమ్ రెడ్డిలు బరిలో నిలిచారు. అయితే..మేకపాటి రాజమోహన్ రెడ్డికి మాత్రం ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు కేటాయించలేదు. రెండు ఎమ్మెల్యే సీట్లు మాత్రమే ఇస్తానని. మూడో సీటుకు గ్యారంటీ ఇవ్వలేనని జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. 

కర్నూలు : కాటసాని
ఇక కర్నూలు జిల్లా విషయానికి వస్తే కాటసాని కుటుంబం నుండి రెండు టికెట్లు కేటాయించారు. పాణ్యం నుండి కాటసాని రాంభూపాల్ రెడ్డి, బనగాపల్లె నుండి కాటసాని రామిరెడ్డిలు ఎన్నికల పోటీలో నిలిచారు. బనగాపల్లె నియోజకవర్గంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి 5 సార్లు, కాటసాని రామిరెడ్డి ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో కాటసాని రామిరెడ్డి ఓటమిపాలయ్యారు. కాటసాని రామిరెడ్డి గతంలో అన్నతో విబేధించి కాంగ్రెస్ నుంచి టిడిపిలో చేరి ఆ తరువాత పిఆర్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కాటసాని రాంభూపాల్ రెడ్డి 2014లో పాణ్యం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో పాణ్యం టికెట్ దక్కించుకున్నారు.