లంచం కోసం భిక్షాటన : అయ్యో అన్నం పెట్టే అన్నదాతకు ఎంతకష్టం

  • Published By: madhu ,Published On : January 26, 2019 / 02:37 PM IST
లంచం కోసం భిక్షాటన : అయ్యో అన్నం పెట్టే అన్నదాతకు ఎంతకష్టం

Updated On : January 26, 2019 / 2:37 PM IST

జయశంకర్ భూపాలపల్లి : అన్నదాత రోడ్డెక్కాడు.. జోలి పట్టి బిక్షమెత్తాడు.. గిట్టుబాటు ధర కోసమో.. పంట నష్ట పరిహారం కోసమో కాదు. ఆకలి తీర్చుకోవడానికి అంతకన్నా కాదు.. తహశీల్దారుకు లంచం ఇవ్వడానికి.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రైతు దంపతుల భిక్షాటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చేతిలో ఫ్లెక్సీ పట్టుకుని.. మెడలో ప్లకార్డులు వేసుకొని భిక్షాటన చేశారు. ఈ వృద్ధ దంపతులు ఎందుకు భిక్షాటన చేశారు ? కారణం ఏంటీ అని తెలుసుకోవాలంటే చదవండి.

పాసు పుస్తకాల కోసం ప్రదిక్షణలు : 
మాంతు బసవయ్య, లక్ష్మి. వృద్ధ దంపతులు. భూపాలపల్లి మండలం ఆజంనగర్‌ గ్రామ శివారులోని 50 సర్వే నంబర్‌లో 1.19 ఎకరాలు, సర్వే నంబర్ 601లో ఎకరం, 622/42లో ఎకరం, 622/52/అ లో 31 గుంటల వ్యవసాయ భూమి ఉంది. ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టిన నాటి నుంచి పట్టాదారు పాసు పుస్తకాల కోసం వారు భూపాలపల్లి తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నా రెవెన్యూ అధికారులు మాత్రం పుస్తకాలు ఇచ్చేందుకు నిరాకరించారు.

 

లంచం కోసం భిక్షాటన : 
రెవెన్యూ అధికారులకు లంచం ఇవ్వనందుకే తమకు పాస్ పుస్తకం ఇవ్వడం లేదని బసవయ్య ఆరోపిస్తున్నారు. పట్టాదారు పుస్తకాలు ఇచ్చేందుకు తహసీల్దార్‌ సత్యనారాయణస్వామి డబ్బులు అడుగుతున్నాడని, తమ దగ్గర డబ్బు లేవని…ముసలివాళ్లం అయినందున ఆదుకోవాలని కోరుతూ భూపాలపల్లి పట్టణ ప్రధాన రహదారిలోని వ్యాపారుల వద్ద భిక్షాటన చేశారు. చేతిలో ఫ్లెక్సీ.. మెడలో ప్లకార్డు ప్రదర్శిస్తూ ప్రతి దుకాణ యజమాని వద్ద అడుక్కున్నారు.

 

స్పందించిన తహసీల్దార్ : 
దీనిపై భూపాలపల్లి తహసీల్దార్‌ నారాయణస్వామి స్పందించారు. బసవయ్య, లక్ష్మి తమకున్న వ్యవసాయ భూమిని ఎప్పుడో అమ్ముకున్నారని…ఆ భూమికి సంబంధించిన కేసు ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్‌లో ఉందని చెప్పారు. గ్రామంలో విచారణ చేపట్టగా 15 ఏళ్లుగా కానుగంటి కొమురయ్యనే భూమిని సాగు చేసుకుంటున్నాడని తేలిందన్నారు. దీంతో పాసు బుక్కును ఇవ్వకుండా నిలిపివేశామని తెలిపారు.

 

కలెక్టర్ ఆదేశాలు : 
సోషల్‌ మీడియాలో బిక్షాటన వ్యవహారం వైరల్‌ కావడంతో కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు స్పందించారు. ఆ వృద్ధ దంపతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందివ్వాలని భూపాలపల్లి ఆర్డీఓ వెంకటాచారిని ఆదేశించారు. వృద్ధ దంపతులను తన కార్యాలయానికి పిలిపించుకున్న ఆర్డీఓ.. భూ రికార్డులను పరిశీలించారు. అదే సమయంలో భూమిని కొనుగోలు చేశానని చెబుతున్న కానుగంటి కొమురయ్యను పిలిపించి ప్రశ్నించారు. బసవయ్య, లక్ష్మిల భూమిని 1981లో తంశెట్టి బానమ్మ కొనుగోలు చేసిందని, ఆమె నుంచి 1989లో తన తండ్రి కానుగంటి మొండయ్య కొనుగోలు చేశాడని, అప్పటి నుంచి తామే కాస్తులో ఉన్నామని చెప్పాడు. 

 

పాసు పుస్తకాల అందవేత : 
2004లో ఆర్‌ఓఆర్‌ పట్టా చేయించుకొని పాస్‌బుక్కు తీసుకున్నట్లు చెప్పాడు. ఆ భూమి తమదేనని బసవయ్య, లక్ష్మి 2011 నుంచి గొడవ చేస్తుండటంతో కోర్టును ఆశ్రయించానని చెప్పాడు. దీంతో ఆర్డీఓ సదరు భూమికి సంబంధించి పట్టాదారు పాసుపుస్తకాలను బసవయ్య, లక్ష్మీలకు అందజేశారు. నిజంగా భూమి కొనుగోలు చేసి ఉంటే, అన్ని డాక్యుమెంట్స్‌తో తనకు అప్పీల్‌ చేసుకోవాలని కొమురయ్యకు సూచించారు. పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల జారీ విషయంలో వీఆర్వోల నుంచి తహశీల్దార్‌ల వరకు డబ్బు డిమాండ్‌ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. బసవయ్య బిక్షాటన ఈ ఆరోపణలకు బలం చేకూర్చిందని రైతులు చెబుతున్నారు.