అడవి పిల్లిని చిరుత పులి అనుకొని పరుగులు

రంగారెడ్డి జిల్లాలో శంషాబాద్ ఎయిర్ పోర్టు దగ్గర అడవి పిల్లి కలకలం సృష్టించింది. ఎయిర్ పోర్టు సిబ్బందికి ముచ్చెమటలు పట్టించింది. అడవి పిల్లిని చూసిన ఎయిర్ పోర్టు సిబ్బంది.. చిరుత పులిగా భావించి ఉరుకులు పగుగులు పెట్టారు.
భయంతో ఎయిర్ పోర్టు నుంచి దూరంగా పరుగులు తీశారు. ఈ ఘటన బుధవారం(నవంబర్ 27, 2019) శంషాబాద్ ఎయిర్ పోర్టులోని ఏరో టవర్స్ దగ్గర చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న ఫారెస్టు, జూ అధికారులు రంగంలోకి దిగారు.
అధికారులు అడవి పిల్లిగా గుర్తించారు. మూడు గంటలపాటు శ్రమించి అడవి పిల్లిని బంధించారు. చిరుతపులి కాదు.. అడవి పిల్లి అని తేలడంతో ఎయిర్ పోర్టు సిబ్బంది, అధికారులతోపాటు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.